Share News

కన్నవారిపైనే కత్తిపోట్లు

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:21 AM

గల్ఫ్‌ రాజధాని రియాధ్‌లో ఓ ప్రవాసాంధ్ర బాలుడు కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డరిచ్చి, అది తిన్నాక కొంత సేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కన్నవారిపైనే కత్తిపోట్లు

  • సౌదీలో రాజమండ్రి కుర్రాడి ఘాతుకం

  • ఆన్‌లైన్‌ గేమ్స్‌ వద్దన్నందుకు ఆగ్రహం

  • తల్లిదండ్రులను చంపి ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌

  • అది తిన్నాక కొంతసేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

  • రియాధ్‌లో ప్రవాసీ కుటుంబీకుల విషాదాంతం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

గల్ఫ్‌ రాజధాని రియాధ్‌లో ఓ ప్రవాసాంధ్ర బాలుడు కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డరిచ్చి, అది తిన్నాక కొంత సేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రియాధ్‌ నగరంలో తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా నివసించే హరా అనే ప్రాంతంలో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి(49), గాలి శ్రీదేవి(43) దంపతులను ప్లస్‌2 చదువుతున్న వారి ఒక్కొగానొక్క కొడుకు యెజ్ర ప్రభాకర్‌ దారుణంగా నరికి చంపాడు. రవి ఒక బ్యాంకులో, శ్రీదేవి ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా కొడుకు ప్రభాకర్‌ స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్‌ 2 చదువుతూ ప్రస్తుతం జరుగుతున్న సీబీఎ్‌సఈ వార్షిక పరీక్షలకు హాజరవుతున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడిన ప్రభాకర్‌.. తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి రూ.5 లక్షల విలువైన ఎక్వి్‌పమెంటను కొలుగోలు చేయించుకున్నాడు. అయితే, చదువును గాలికి వదిలేసి.. రోజులో అత్యధిక భాగం ఆన్‌లైన్‌ గేమ్స్‌లో తలమునకలై ఉండడంతో వారు మందలిస్తూ వస్తున్నారు. ఇదే విషయమై గురువారం రాత్రి మరోసారి తల్లిదండ్రులు మందలించడంతో.. ప్రభాకర్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. విచక్షణ కోల్పోయి.. తల్లిదండ్రులిద్దరిపైనా కత్తిదూశాడు. అనేకమార్లు పొడిచిపొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చి భుజించాడు. కొంతసేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం తెలిసి రియాధ్‌లోని తెలుగు ప్రవాసీ సమాజం తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. రవి, శ్రీదేవి దంపతులు ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఉంటారని, కన్నకొడుకు చేతిలోనే ఇంతదారుణంగా బలైపోతారని అనుకోలేదని పలువురు ప్రవాసీయులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హరా ప్రాంతంలోని కొన్ని కమ్యూనిటీ(నివాస ప్రాంతాలు)ల్లో యువత చదువులకు స్వస్తిపలికి, ఎక్కువగా ఆన్‌లైన్‌ గేమ్స్‌లో తలమునకలై ఉండడం తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది.

Updated Date - Feb 28 , 2026 | 04:21 AM