క్యాన్సర్‌తో బాలుడి పోరాటం
ABN , Publish Date - May 07 , 2026 | 05:12 AM
పుట్టిన నాలుగు నెలలకే తల్లి వదిలి వెళ్లిపోవడం.. ఆ తర్వాత తండ్రి ఆనారోగ్యంతో మరణించడంతో అవ్వ, తాతల వద్ద పెరుగుతున్న ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని..
దాతల కోసం అవ్వా, తాతల ఎదురుచూపులు
2 కాళ్లు చచ్చుబడిపోయి, కంటిచూపు కోల్పోయిన బాలుడు
మంగళ్‌హాట్, మే 6 (ఆంధ్రజ్యోతి): పుట్టిన నాలుగు నెలలకే తల్లి వదిలి వెళ్లిపోవడం.. ఆ తర్వాత తండ్రి ఆనారోగ్యంతో మరణించడంతో అవ్వ, తాతల వద్ద పెరుగుతున్న ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని.. క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వృద్ధులైన నానమ్మ, తాతయ్య వెంకటక్ష్మమ్మ, వెంకటరమణలు బాలుడిని కాపాడుకోలేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన గోగుల వీరేంద్ర నాథ్(15) అనే బాలుడికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు 2025లో బ్రెయిన్ క్యాన్సర్ అని నిర్ధారించారు. అప్పటినుంచి కీమోఽథెరపీ, రేడియేషన్ చికిత్సలు అందించినప్పటికీ.. వ్యాధి ముదిరి చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ప్రస్తుతం బాలుడి రెండు కాళ్లకు స్పర్శ లేకుండా పోయి, కదిలించలేని స్థితికి చేరుకున్నాడు. తలలో, కనురెప్పల వద్ద క్యాన్సర్ కణితులు రావడంతో కంటిచూపును కూడా కోల్పోయాడు. తాతయ్య వృద్ధుడు కావడంతో ఇంటి వద్దే ఉండగా, నానమ్మ స్థానికంగా దోశల బండిని నిర్వహిస్తూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోంది. మనవడి చికిత్స కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేవని ఆ వృద్ధులు కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు పెద్దమనసుతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సహాయం అందించాలనుకునే వారు అకౌంట్ నెంబర్ 42815841628 (IFSC CODE: SB-IN0021589)లో వేయాలని లేదా ఫోన్ నెంబర్ 7842041866 నంబర్‌లో సంప్రదించాలని వారు అర్థిస్తున్నారు.