Technical Glitch Forces Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశ్రుతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:43 AM
సంక్రాంతి సంబురాల్లో భాగంగా.. జనవరి 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు పర్యాటక శాఖ నిర్వహిస్తోన్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో రెండో రోజు అపశ్రుతి చోటు చేసుకుంది...
సాంకేతిక లోపంతో చెరువులో ల్యాండ్ అయిన బెలూన్
నీళ్లు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
సురక్షితంగా బయటపడిన ముగ్గురు
నార్సింగ్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి సంబురాల్లో భాగంగా.. జనవరి 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు పర్యాటక శాఖ నిర్వహిస్తోన్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో రెండో రోజు అపశ్రుతి చోటు చేసుకుంది. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి మొదలైన ఒక బెలూన్ నెక్నాంపూర్ పరిధిలోని ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువు వద్దకు రాగానే సాంకేతిక సమస్య ఏర్పడి చెరువులో ల్యాండ్ అయ్యింది. అయితే చెరువులో నీళ్లు లేకపోవడంతో అందులో ఉన్నవారికి పెను ప్రమాదం తప్పింది. ఆ బెలూన్‌లో ఇద్దరు జర్నలిస్టులు, ఒక టెక్నీషియన్ ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ షో నిర్వహిస్తున్న పర్యాటక శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోపక్క పరేడ్ గ్రౌండ్ నుంచి బయలుదేరినమరో బెలూన్ మంచి రేవులలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ మైదానంలో అకస్మాత్తుగా ల్యాండ్ అయ్యింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందులోనూ ముగ్గురు ఉన్నారు. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ రెండు బెలూన్లు కిందకు దిగాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో కేసులు నమోదు చేయలేదని, ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం అని పోలీసులు వెల్లడించారు.