Share News

నైనీ టెండర్లపై అధ్యయనానికి సాంకేతిక కమిటీ

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:46 AM

ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అధ్యయనం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇద్దరు అధికారులతో సాంకేతిక కమిటీ వేసింది.

నైనీ టెండర్లపై అధ్యయనానికి సాంకేతిక కమిటీ

  • టెండర్‌ రద్దుకు కారణాలు, సింగరేణి నిబంధనలపై విశ్లేషణ

  • మూడు రోజుల్లో నివేదికకు కేంద్రం ఆదేశం

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అధ్యయనం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇద్దరు అధికారులతో సాంకేతిక కమిటీ వేసింది. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దుకు గల కారణాలు.. సింగరేణి విధించినటెండర్‌ నిబంధనలను విశ్లేషించి మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. ఈ మేరకు బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రదీ్‌పరాజ్‌ నయన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నైనీ టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు వెనక గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఆయన చర్యలు చేపట్టారు. ఇక ఈ సాంకేతిక కమిటీలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చేత్నా శుక్లా, డైరెక్టర్‌ మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ కమిటీ నైనీ కోల్‌ బ్లాక్‌ మైన్‌ డెవలపర్‌, ఆపరేటర్‌ (ఎండీవో) నియామకం కోసం గతేడాది నవంబరు 28న జారీ చేసిన టెండర్‌ ఆహ్వాన నోటీసును విశ్లేషించి, టెండర్‌ రద్దుకు కారణాలేంటి..? బొగ్గు ఉత్పత్తి కోసం ఇతర కోల్‌ కంపెనీలు అనుసరించే పద్ధతులేంటి..? సింగరేణి విధించిన టెండర్‌ నిబంధనకు, ఇతర కంపెనీల అనుసరిస్తున్న నిబంధనలకు తేడాలు ఏమున్నాయి..? కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులను ఏ విధంగా వెచ్చిస్తున్నారు..? ఏయే నిబంధనలు అనుసరిస్తున్నారు..? అనే అంశాలపై సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, మూడు రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది.

Updated Date - Jan 23 , 2026 | 04:46 AM