Share News

వీకెండ్‌ పార్టీకి వెళ్లి విగతజీవై..

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:40 AM

వీకెండ్‌ పార్టీ కోసం స్నేహితులతో కలిసి ఫామ్‌హౌ‌స్‍కు వచ్చిన ఓ టెకీ స్విమ్మింగ్‌ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ....

వీకెండ్‌ పార్టీకి వెళ్లి విగతజీవై..

  • ఫామ్‌హౌ‌స్‍లో టెకీ అనుమానాస్పద మృతి

  • భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఘటన

చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వీకెండ్‌ పార్టీ కోసం స్నేహితులతో కలిసి ఫామ్‌హౌ‌స్‍కు వచ్చిన ఓ టెకీ స్విమ్మింగ్‌ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా నర్సాపూర్‌ మండలం శ్రీరాంపూర్‌కు చెందిన రాము(27) హైదరాబాద్‌ ఉప్పల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూకట్‌పల్లిలో ఉంటున్నాడు. శనివారం వీకెండ్‌ కావడంతో 19 మంది స్నేహితులు, టీం లీడర్‌ రామ్‌కుమార్‌తో కలిసి చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావి పరిధిలోని ఆరోవా ఫామ్‌హౌ‌స్‍కు వచ్చారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ నృత్యాలు చేస్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ గడిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు యువకులు ఈత కొడుతుండగా రాము మృతదేహం వీరి కాళ్లకు తగలటంతో మిగతా స్నేహితులకు తెలిపారు. స్నేహితులు రాముకు సీపీఆర్‌ (కార్డియో పల్మోనరీ రెసిస్టేషన్‌) చేసి అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పార్టీ జరిగిన సమయంలో స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగిందని, తర్వాత అది సద్దు మణిగిందని సీఐ మన్మథ కుమార్‌ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు. కాగా, తన కుమారుడిని స్నేహితులే చంపారని రాము తండ్రి గాండ్ల అంజయ్య.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 15 , 2026 | 04:40 AM