Job Growth: టెక్ రంగంలో ఉద్యోగాల జాతర
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:51 AM
భారతీయ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ నియామకాలు 2026లో గణనీయంగా పెరగనున్నాయని వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడిక్కో ఇండియా వెల్లడించింది.
2026లో 1.25 లక్షల కొత్త నియామకాలు
వెల్లడించిన అడిక్కో ఇండియా నివేదిక
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): భారతీయ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ నియామకాలు 2026లో గణనీయంగా పెరగనున్నాయని వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడిక్కో ఇండియా వెల్లడించింది. శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరిగే మొత్తం నియామకాల్లో 12-15ు వృద్ధి నమోదవుతుందని, దీనిద్వారా సుమారు 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో కొనసాగిన స్తబ్దతకు తెరపడి, 2025 నుంచి నియామకాలు స్థిరపడడం ఈ సానుకూల ధోరణికి కారణమని విశ్లేషించింది. టెక్ కంపెనీలే కాకుండా నాన్‌టెక్ రంగాల్లోని సంస్థలు కూడా డిజిటల్ పరివర్తనకు పెద్దపీట వేస్తుండడం ఒక ముఖ్యమైన పరిణామమని అడిక్కో ఇండియా డైరెక్టర్ సంకేత్ చెన్నప్ప తెలిపారు. ప్రస్తుతం ఏఐ, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాలు కంపెనీల ప్రాథమిక అవసరాలుగా మారిపోయాయని నివేదిక వెల్లడించింది.