స్కూళ్ల తగ్గింపు ప్రభుత్వ విద్యకు మరణ శాసనం
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:13 AM
ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. సర్కారు బడులను 27 వేల నుంచి 4 వేలకు తగ్గిస్తామని..
ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
ముఖ్యమంత్రి ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. సర్కారు బడులను 27 వేల నుంచి 4 వేలకు తగ్గిస్తామని సీఎం శనివారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల బాధ్యత అని, దానికి విరుద్ధంగా ప్రవర్తించడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనని పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు విద్యాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి తెలిపారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే పాఠశాలలను మూసివేయడం పరిష్కారం కాదని, వారు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా నాణ్యమైన బోధన, తగిన ఉపాధ్యాయుల నియామకం, సమగ్ర మౌలిక వసతులు, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ, పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచ్చిన ప్రధాన వేదికలని.. అలాంటి పాఠశాలల సంఖ్యను తగ్గించడం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ తెలిపారు. పక్కాగా తరగతి గదులు నిర్మించి, ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాడి రాజన్న, మేడి చరణ్ దాస్ తెలిపారు. ప్రభుత్వ బడులను తగ్గించేందుకు విద్యాహక్కు చట్టం అంగీకరించదని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల సంఘం(టీఎ్‌సపీటీయే) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్.రోహిత్ పేర్కొన్నారు. సీఎం ప్రకటనను తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) ఖండించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఉద్యమిస్తాయని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్.అనిల్ కుమార్, నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.