విద్యా కమిషన్ సిఫారసులపై ఉపాధ్యాయుల భగ్గు
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:25 AM
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమర్పించిన విద్యావిధాన పత్రం-2026ను అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని వివిధ సంఘాలు డిమాండ్ చేశాయి...
వాటి అమలుకు ముందు మాతో చర్చించాలి
కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి
సమగ్రంగా అధ్యయనం చేయలేదన్న సంఘాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమర్పించిన విద్యావిధాన పత్రం-2026ను అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని వివిధ సంఘాలు డిమాండ్ చేశాయి. ‘కమిషన్ సిఫారసుల్లో కొన్ని ప్రభుత్వ విద్యారంగానికి మేలు చేసే విధంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు సంబంధించిన సిఫారసుల విషయంలో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇవి ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇలాంటి సిఫారసుల విషయంలో విద్యాకమిషన్ చైర్మన్ పునరాలోచించుకోవాలి’ అని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇతర వృత్తులకంటే ఎక్కువ వేతనాలు ఉండాలని జాతీయ విద్యాకమిషన్(కొఠారి కమిషన్) సూచనలకు విరుద్ధంగా ఈ సిఫారసులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించడం, అప్రెంటిస్ విధానం అమలు చేయడం వంటి సిఫారసులు ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ సిఫారసులతో మేలు జరిగేదేమీలేదని, ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని వారు తెలిపారు.
వేతనాలు ఎక్కువనే సిఫారసును ఖండిస్తున్నాం: పీఆర్‌టీయూటీఎస్
ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ అని, వీటిని తగ్గించాలని సిఫారసు చేయడాన్ని పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు పులగం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు సీనియారిటీ ద్వారా కాకుండా అర్హతల ద్వారా అనడం అర్థరహితమని తెలిపారు. ఇక విద్యా కమిషన్ నివేదిక నేలవిడిచి సాము చేసినట్లుగా ఉందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకుంట జగదీశ్, ములకనూరి శంకర్‌లు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులగౌరవాన్ని దెబ్బతీసేలా విద్యావిధాన నివేదిక ఉందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి వెంకటయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థపై సమగ్రంగా అధ్యయనం చేయలేదన్నారు. రాష్ట్రంలో విద్యా స్థితిగతులపై అధ్యయనం చేసి, నివేదిక అందించిన విద్యా కమిషన్ తన పరిధిని దాటి సిఫారసులు చేసిందని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(టీఎ్‌సటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్.రోహిత్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు మాతృభాష తప్పనిసరి అనే సూచనలను స్వాగతిస్తున్నామని, ఇతర సిఫారసులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణలు తెలిపారు. ఉపాధ్యాయుల వేతనాలు ద్రవ్యోల్బణం ఆధారంగా సవరిస్తారని, ఇటువంటి వేతనాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక ఇవ్వడాన్ని ఎస్‌జీటీయూ అధ్యక్ష, కార్యదర్శులు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం ఒక ప్రకటనలో ఖండించారు.
కొత్త విద్యావిధానం ఎలా తెస్తారో రేవంత్ చెప్పాలి: హరీశ్
రాష్ట్ర విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఎక్కడ ఉన్నారు.. పీహెచ్‌డీ చేసిన ఒక్కరు కూడా లేకుండానే కొత్త విద్యా విధానం ఎలా తెస్తారో.. సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లు తప్ప.. పీహెచ్‌డీ చేసిన వాళ్లుకానీ, స్కూల్ సిలబస్ తయారీలో, కోర్ సైన్స్ సబ్జెక్టుల్లో పట్టున్న వాళ్లు కానీ ఈ కమిటీ లో ఒక్కరైనా ఉన్నారా చెప్పాలని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన నిలదీశారు.తెలంగాణ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే నిర్ణయాలను ఆపాలన్నారు.