పార్టీ బీఫారాలు ఇవ్వకున్నా ఎన్నికల బరిలో టీడీపీ శ్రేణులు
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:28 AM
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ బీఫారాలు ఇవ్వకున్నా.. ముఖ్య నేతలు పిలుపు ఇవ్వకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో...
ఖమ్మం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ బీఫారాలు ఇవ్వకున్నా.. ముఖ్య నేతలు పిలుపు ఇవ్వకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పలుచోట్ల టీడీపీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగితే మరికొందరు సీపీఐ తరఫున పోటీ చేస్తున్నారు. నిజానికి, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు పలుచోట్ల గెలుపొందారు. మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించగా.. ఎన్నికల బరిలో నిలవాలని ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆరుగురు మాత్రం పోటీకి దిగారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రె్‌సతోపొత్తు పెట్టుకోవడంతో టీడీపీకి 3వార్డులు కేటాయించారు. దాంతో 10, 16, 17 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు స్వతంత్రులుగా నామినేషన్లువేశారు. సైకిల్ గుర్తుపై కాక తమకు కేటాయించిన గుర్తుతో ప్రచారం చేసుకుంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. దీంతో ఆ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలో 5, 37, 42వార్డుల్లో టీడీపీ అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పార్టీ బీఫారాలు ఇవ్వకపోడంతో మిత్రపక్షం సీపీఐ బీఫాంలతో కంకి కొడవలి గుర్తుపై పోటీలో ఉండి టీడీపీ, సీపీఐ జెండాలు చేతపట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఇతర పార్టీల వారు టీడీపీ జెండాలు పట్టి ప్రచారం చేసుకుంటున్నారు.