Share News

kumaram bheem asifabad- రోడ్డున పడనున్న టీసీవోలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:32 PM

తహసీల్దార్‌ కార్యాలయాలనే నమ్ముకుని 20 ఏళ్లుగా సేవలు అందించిన టైపిస్టు కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌(టీసీవో) ఆశలపై కాంగ్రెస్‌ సర్కార్‌ నీళ్లు చల్లింది. రెవెన్యూశాఖలో 2006 సంవత్సరంలో తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో అవసరాన్ని బట్టి టైపిస్టు కం కంప్యూటర్‌ ఆపరేటర్‌(టీసీవో)పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉన్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 632 మంది పనిచేస్తున్నారు

kumaram bheem asifabad- రోడ్డున పడనున్న టీసీవోలు
ఎమ్మెల్సీ దండే విఠల్‌కు వినతిపత్రం ఇస్తున్న టీసీవోలు(ఫైల్‌)

- 20 ఏళ్లుగా కొనసాగినా కనికరం లేదని సిబ్బంది ఆవేదన

- ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌ కార్యాలయాలనే నమ్ముకుని 20 ఏళ్లుగా సేవలు అందించిన టైపిస్టు కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌(టీసీవో) ఆశలపై కాంగ్రెస్‌ సర్కార్‌ నీళ్లు చల్లింది. రెవెన్యూశాఖలో 2006 సంవత్సరంలో తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో అవసరాన్ని బట్టి టైపిస్టు కం కంప్యూటర్‌ ఆపరేటర్‌(టీసీవో)పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉన్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 632 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం గ్రూపు-4 ఉద్యోగాలు భర్తీ చేశామనే కారణంతో టీసీవోలను తొలగించాలంటూ తహసీల్దార్లకు సీసీఎల్‌ఏ నుంచి మౌఖిక ఉత్తర్వులు వచ్చాయని ఒక వేల తీసేయని పక్షంలో వారి వేతనాలను అధికారులు చెల్లించాల్సి ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో తెలిపినట్లు తెలిసింది. ఇదే జరిగితే 20 ఏళ్ల నుంచి ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ప్రస్తుతం రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది.

- 15 మండలాల పరిధిలో..

టైపిస్టు కంప్యూటర్‌ ఆపరేటర్‌ పేరుతో జిల్లాలోని 15 మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి సర్టిఫికెట్‌, ప్రతి కంప్యూటర్‌ పని కూడా వీరే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరిని కొనసాగించకపోతే కొన్నిచోట్ల కార్యాల యాలు కూడా నడిచే పరిస్థితి లేదని ఓ జిల్లా స్థాయి అధికారి పేర్కొ నడం వీరి అవసరాన్ని తెలుపుతోంది. ఆన్‌లైన్‌ పనుల్లో వీరే ముఖ్యపాత్ర పోషిస్తారని విషయాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేసినట్లు వివరించారు. ఇప్పటికే రెవెన్యూశాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తూ ఎప్పుడైనా ప్రభుత్వాలు తమను గుర్తించి తమ సర్వీసు రెగ్యులర్‌ చేయకపోతరా అని ఎదురుచూసిన టీసీవోలు సీసీఎల్‌ఏ నిర్ణయంతో వారి కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ఇప్పటికే గతేడాది ఏప్రిల్‌ నుంచి వేతనాలు మంజూరు చేయన ప్పటికీ పని చేస్తున్న వీరికి ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం తీరని ఆశనిపాతంగా మారింది.

- తీవ్ర పనిభారంతో..

రెవెన్యూ కార్యాలయాల్లో తీవ్రమైన పని భారంతో టీసీవోలను అనధికారికంగా ఇంకా కొనసాగిస్తున్నారు. సీసీఎల్‌ఏ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ‘సర్‌’ ప్రక్రియ, జనగణన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కార్యాలయాల్లో వీరి అవసరం ఎంతగానో ఉంటుంది. దీంతో తహసీల్దార్లు, సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి పలు సందర్భాల్లో వీరి అవసరాన్ని వివరిస్తూ నివేదికలు కూడా పంపించారు. అయినప్ప టికీ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినా తప్పని పరిస్థితుల్లో వీరిని కొనసాగిస్తున్నట్లు తెలిసింది. తమ సేవలను గుర్తించాలని టీసీవోలు కోరుతున్నారు.

డిమాండ్లు ఇలా..

- తమ సేవలను నిలిపివేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలి.

- పే స్కేల్‌ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలి.

- సెర్ప్‌ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ భద్రత ఇవ్వాలి.

- ఆరోగ్య భద్రత పథకంను అమలు చేయాలి.

- వీఆర్‌ఏల మాదిరిగా తమను సర్దుబాటు చేయాలి.

ఉద్యోగ భద్రత కల్పించాలి..

- యాసీన్‌, టీసీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 20 ఏళ్లుగా పనిచేస్తూ ప్రస్తుతం ఎటు వంటి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హత లేని సమయంలో ప్రభుత్వం మమ్మలను తీసివే స్తామనడం సరైన విధానం కాదు. ఇన్నాళ్లుగా ఈ పనినే నమ్ముకుని కుటుంబాలను పోషించుకున్నాం. మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి.

చాలీచాలని వేతనాలతో..

- సునిల్‌, టీసీవోల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి

రెండు దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నాం. టెర్మినేషన్‌ని వెంటనే ఉపసంహరించుకొని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 20 ఏళ్లుగా పని చేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు వేరే పనుల్లోకి తీసుకునే అవఅకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం కనికరం చూపాలి.

Updated Date - Jun 24 , 2026 | 10:32 PM