Share News

టీబీ మందుల్లేవ్‌! తీవ్ర కొరతతో అల్లాడుతున్న క్షయరోగులు..

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:04 AM

రాష్ట్రంలో క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీబీ నివారణకు వాడే కీలకమైన ఔషధాలకు గత 3నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత ఏర్పడిందని రోగులు వాపోతున్నారు.

టీబీ మందుల్లేవ్‌! తీవ్ర కొరతతో అల్లాడుతున్న క్షయరోగులు..

  • ప్రభుత్వ కేంద్రాల్లో 3 నెలలుగా నిల్వలు నిల్‌!

  • మందులు వాడకపోతే వ్యాధి తిరగబడే ముప్పు

  • ప్రైవేటులో అమ్మకాలపై నిషేధం

  • రాష్ట్రంలో 70 వేలమందికి పైగా బాధితులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీబీ నివారణకు వాడే కీలకమైన ఔషధాలకు గత 3నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు వాడే పిడియాట్రిక్‌ మందులతో పాటు పెద్దలకు వాడే సైకోసెరిన్‌, లెవోఫ్లోక్సాసిన్‌ వంటి మందులు అందుబాటులో లేవని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన తర్వాత రోగులు కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటేనే క్షయ నియంత్రణలోకి వస్తుంది. ఒకవేళ మధ్యలో 15రోజులకు మించి మందులు వాడటం ఆపేస్తే, శరీరంలోకి బ్యాక్టీరియా బలపడి.. వ్యాధి మరింత ముదిరి మొదటికే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందులు సక్రమంగా వాడకపోతే సాధారణ టీబీ కాస్త మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ (ఎండీఆర్‌-టీబీ)గా మారుతుంది. దీనివల్ల చికిత్సా కాలం పెరగడమే కాకుండా, ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 70వేలకు పైగా టీబీ రోగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతీనెలా కొత్తగా ఐదారు వేల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం(ఎన్‌టీఈపీ) ద్వారా వ్యాధినిర్ధారణ అయినవారికి, 6 మాసాల పాటు ఉచితంగానే ఔషధాలను అందిస్తుంది. అయితే, గడిచిన 3 నెలలుగా ఎన్‌టీఈపీ టీబీ ఔషధాలను సరిగా సరఫరా చేయడం లేదని టీబీ రోగులు చెబుతున్నారు. ప్రాథమిక చికిత్సకు వాడే ఐసోనయాజిడ్‌, రిఫాంసిపిన్‌ వంటి మందులతో పాటు తీవ్రత పెరిగిన వారికి అవసరమైన బెడాక్విలిన్‌, ప్రిటోమానిడ్‌, డెలామానిడ్‌ వంటి ఔషధాల కొరత తీవ్రంగా ఉందని, నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వాల్సి ఉండగా నిల్వలు లేవంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని వాపోతున్నారు.


ప్రభుత్వ నిబంధనలే శాపమా ?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం, టీబీ మందులు కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, నోడల్‌ సెంటర్ల ద్వారానే పంపిణీ కావాలి. ఎవరైనా రోగి సర్కారు దవాఖానాకు రావడం ఇష్టం లేక.. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే, అక్కడ కేవలం చికిత్స మాత్రమే అందించాలి తప్ప మందులను నేరుగా రోగికి ఇవ్వకూడదు. ప్రైవేటు వైద్యులు కూడా టీబీ కేసులను తప్పనిసరిగా సర్కారుకే రిపోర్ట్‌ చేయాలనే నిబంధన ఉంది. దీంతో సాధారణ మెడికల్‌ షాపుల్లో మందుల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయు. ఇప్పుడు ప్రభుత్వ కేంద్రాల్లోనే ‘స్టాక్‌ లేదు’ అని సమాధానం వస్తుండడంతో రోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గతేడాది కూడా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు టీబీ ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడి.ందని, ప్రస్తుతం కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొందని బాధితులు అంటున్నారు.

మందులు పుష్కలంగా ఉన్నాయి

రాష్ట్రంలో క్షయ వ్యాధి నివారణ మందుల కొరత ఉందంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. టీబీ రోగులకు ఔషధాలు అందకపోతే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. రోగులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతేడాది 2, 3 నెలల పాటు కొంచెం ఇబ్బంది ఎదురైన మాట నిజమే.. కానీ, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు.

- డాక్టర్‌ రాజేశం, టీబీ ప్రొగ్రామ్‌ జాయింట్‌ డైరెక్టర్‌

Updated Date - Apr 20 , 2026 | 06:59 AM