బయట ‘నో డ్రగ్స్’ బోర్డు
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:51 AM
చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని తారామతి రిసార్ట్ శనివారం రాత్రి హై ప్రొఫైల్ డ్రగ్స్ పార్టీకి వేదికైంది. ‘సే నో టు డ్రగ్స్’ అని బయట బోర్డు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, లోపల యథేచ్ఛగా...
లోపల ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో మత్తు చిందులు
ప్రముఖ డీజే జాసన్ సహా 6గురికి పాజిటివ్
తారామతి రిసార్ట్ డ్రగ్స్ పార్టీపై ఈగల్ పంజా
లక్షల్లో ఎంట్రీ ఫీజు
లిస్టులో సినీ నటుడు, వ్యాపార జంట ?
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని తారామతి రిసార్ట్ శనివారం రాత్రి హై ప్రొఫైల్ డ్రగ్స్ పార్టీకి వేదికైంది. ‘సే నో టు డ్రగ్స్’ అని బయట బోర్డు ఏర్పాటు చేసిన నిర్వాహకులు, లోపల యథేచ్ఛగా నిషేదిత డ్రగ్స్ సరఫరా చేశారు. విచిత్రమేంటంటే, ఈ పార్టీ ప్రచార చిత్రాల్లో ‘డ్రగ్స్‌కి దూరంగా ఉండండి’ అనే నినాదాన్ని ప్రముఖంగా ప్రదర్శించిన నిర్వాహకుడే స్వయంగా మత్తుపదార్థాలు సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. పక్కా సమాచారం మేరకు పార్టీకి ఏమాత్రం అంతరాయం కలిగించకుండా రంగంలోకి దిగిన ఈగల్ బృందం, డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అక్కడ నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో ప్రముఖ డీజే జాసన్ డైలాన్ సహా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ఆయన శరీరంలో ‘యాంఫెటమైన్’ అనే మత్తుపదార్థం ఉన్నట్లు తేలింది. జాసన్‌కు గతంలోనూ డ్రగ్స్ వినియోగించిన చరిత్ర ఉండటంతో ఆయన కాంటాక్ట్ లిస్ట్‌పై ఈగల్ బృందం నిఘా పెట్టింది. ముంబైతో పాటు జాతీయస్థాయిలో డ్రగ్ డీలర్లతో ఉన్న సంబంధాలపై అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. డీజేలు జాక్, జాసన్ ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో సంయుక్తంగా నిర్వహించిన ఈ పార్టీకి హైదరాబాద్‌లోని సంపన్న వర్గాలు హాజరయ్యాయి. ఏంట్రీ కోసం ఒక్కో గ్రూపు నుంచి రూ. 50వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ‘బ్యాక్ టూ బ్యాక్ మ్యూజిక్’, ‘అన్‌లిమిటెడ్ లిక్కర్’ అంటూ ఆకర్షించి.. మత్తులో ముంచెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ‘సర్వర్’ అని పిలిచే నటుడి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిహార్, ఆషి అనే వ్యాపార జంట ఈ పార్టీ నిర్వహణలో లేదా డ్రగ్ సరఫరాలో కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు. పట్టుబడిన వారి ఫోన్ డేటా ఆధారంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ?, ఎవరెవరూ సరఫరా చేశారు ?.. అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ సరఫరా నుంచి పార్టీకి టచ్‌లో ఉన్నవారి వరకు అందర్నీ పట్టుకుని, డ్రగ్ టెస్ట్‌లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, లోపల మత్తు దందా సాగించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.