అదనపు చపాతీ అడిగాడని వాతలు పెట్టారు..!
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:15 AM
వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్(బాలుర) గురుకుల పాఠశాలలో ఆదివారం దారుణం జరిగింది. అదనపు చపాతీ కావాలని అడిగిన ఎనిమిదో తరగతి విద్యార్థికి..
8వ తరగతి విద్యార్థిపై చపాతీ పెనంతో సీనియర్ల దాడి
తాండూరు గురుకుల హాస్టల్‌లో ఘటన
తాండూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్(బాలుర) గురుకుల పాఠశాలలో ఆదివారం దారుణం జరిగింది. అదనపు చపాతీ కావాలని అడిగిన ఎనిమిదో తరగతి విద్యార్థికి తొమ్మిదో తరగతి విద్యార్థులు కొందరు చపాతీ పెంచు(పెనం)తో వాతలు పెట్టారు. విద్యార్థుల కథనం ప్రకారం.. తాండూరు శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్(బాలుర) గురుకుల పాఠశాలలో హైస్కూల్ విద్యార్థులతో పాటు జూనియర్ కళాశాల విద్యార్థులు హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే, ఆదివారం భోజన సమయంలో సాయిబాలాజీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి తనకు అదనపు చపాతి కావాలని అడిగాడు. అయితే, ఇంకో చపాతీ ఎందుకు పెట్టాలంటూ తొమ్మిది తరగతి విద్యార్థులు ఇద్దరు సాయిబాలాజీకి పెంచుతో వాతలు పెట్టారు. కాగా, హాస్టల్‌లో తమతో వంట పనులు, బాత్‌రూమ్‌లు, వరండా శుభ్రం చేయించడం వంటివి చేయిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థిపై జరిగిన దాడి విషయం తెలుసుకొని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే హాస్టల్‌కు వచ్చారు. కానీ, సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. పోలీసులు వచ్చినా సరే ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. కాగా, ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ వివరణ కోరగా... బాధిత విద్యార్థి సాయిబాలాజీ గతంలో కూడా దురుసుగా మాట్లాడటం, గోడవలు పడటం వంటివి చేశాడని మరోసారి తప్పు చేయనని గతంలో లిఖితపూర్వక హామీ ఇచ్చాడని, ఆ తర్వాతే పాఠశాలలో కొనసాగిస్తున్నామని చెప్పారు. పాఠశాలలో జరిగిన ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు.