తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష.. బీఆర్ఎస్‌దే అధికారం: తలసాని
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:45 AM
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
తిరుమల, అక్టోబర్ 08: తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తద్వారా తెలంగాణ ప్రజల కష్టాలు త్వరలోనే తీరతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆనందనిలయం వెలుపల తలసాని శ్రీనివాసయాదవ్ విలేకర్లతో మాట్లాడారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు కరెంటు కష్టాలతో పాటు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు కనీసం 6 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమైన పరిపాలన అందించిందని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాసయాదవ్ వివరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయంలో పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మరో వైపు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, తెల్ల కాగితం సినిమా హీరో హర్ష రోషన్, హీరోయిన్ నక్షత్ర, దర్శకుడు రమేశ్‌తోపాటు నటుడు దినేశ్ తేజ్ దర్శించుకున్నారు.