Share News

ఆర్డీవోల నెత్తిమీద తహసీల్దార్లు!

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:54 AM

ఓ తెలుగు సినిమాలో ఎస్‌ఐ కోట శ్రీనివాసరావు తప్పు చేశారని ఆయన కింద పనిచేసే కానిస్టేబుల్‌ మల్లికార్జునరావును ఎస్‌ఐను చేస్తారు. కోట శ్రీనివాసరావుకు మల్లికార్జునరావు పక్కనే కాని....

ఆర్డీవోల నెత్తిమీద తహసీల్దార్లు!

  • డీఆర్వోలుగా 12 మంది తహసీల్దార్లకు బాధ్యతలు.. కీసర ఆర్డీవో పోస్టులో తహసీల్దార్‌ నియామకం

హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్ర జ్యోతి): ఓ తెలుగు సినిమాలో ఎస్‌ఐ కోట శ్రీనివాసరావు తప్పు చేశారని ఆయన కింద పనిచేసే కానిస్టేబుల్‌ మల్లికార్జునరావును ఎస్‌ఐను చేస్తారు. కోట శ్రీనివాసరావుకు మల్లికార్జునరావు పక్కనే కానిస్టేబుల్‌గా బాధ్యతలు అప్పగిస్తారు. కోట ఫ్రస్టేషనే ఆ సినిమాకు హైలెట్‌. ఇలాంటి సినిమాటిక్‌ ప్రమోషన్లు ఇప్పుడు తెలంగాణ రెవెన్యూ శాఖలోనూ చోటు చేసుకున్నాయి. రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్లు తన మాట వినడం లేదని ఆగ్రహించిన రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ఎడాపెడా బదిలీలు చేసేశారు. ఆర్డీవోల నెత్తి మీద ఏకంగా జిల్లా రెవెన్యూ అధికారులుగా ఎమ్మార్వోలను కూర్చోబెట్టారు. ప్రమోషన్లు ఇవ్వకపోయినా బాధ్యతలు కట్టబెట్టారు. ఇటీవల ఆయన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో తాను ఏం చేయబోతున్నారో ముందే చెప్పారు. ‘‘భూ సమస్యలు, సాదాబైనామా ఇతర అంశాలకు సంబంధించి ఏ ఆదేశం ఇచ్చినా మీరు పట్టించుకోవడం లేదు. నేనేంటో చూపిస్తా. మీ కింది స్థాయి వారిని మీపైన నియమించి వారితోనే పని చేయిస్తా’’ అని హెచ్చరించారు. ఇలాంటివి చాలా చూశాములే... నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తారు? అని అందరూ లైట్‌గా తీసుకున్నారు. ఆ కీలక అధికారి మాత్రం తాను హెచ్చరించినట్లే రెండు రోజుల్లో షాక్‌ ఇచ్చారు. తహసీల్దార్‌ క్యాడర్‌లో ఉన్న వారిని ఏకంగా జిల్లా రెవెన్యూ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ‘అట్లుంటది మనతోని’ అని చెప్పకనే చెప్పారు. ఒక క్యాడర్‌ నుంచి మరో క్యాడర్‌లోకి పదోన్నతి పొందాలంటే దశాబ్దకాలం పైన ఎదురుచూడాలి. ఒక్కో మెట్టు ఎక్కి సర్వీస్‌ నిబంధనల ప్రకారం అవకాశం దక్కించుకోవాలి. ఏ రిమార్కు లేకపోతేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు తాజా పరిస్థితిని చూస్తే పదోన్నతి లేకుండానే డీఆర్వో బాధ్యతలు చూస్తున్న ఎమ్మార్వోలకు అలాంటి అదృష్టం దక్కిందని రెవెన్యూ ఉద్యోగులు అనుకుంటున్నారు. నిబంధనలు, సర్వీస్‌ రూల్స్‌, సీనియారిటీని చెత్తబుట్టలో వేసి అవసరం కోసుం ఉత్తర్వులు ఇవ్వడంతో రెవెన్యూ శాఖలో సీనియర్లు ఒకరినొకరు చూసుకుంటూ మరి మేమేందుకు ఇన్నేళ్లు ఎదురు చూశాం అని ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది. 12 మంది తహసీల్దార్లకు డీఆర్వో పోస్టులు ఇస్తూ మే 27న ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా సోమవారం జారీ చేసిన జీవో 338లో 9 మందిని బదిలీ చేశారు. అందులో తహసీల్దార్‌గా ఉన్న నల్లా వెంకటరెడ్డిని కీసర ఆర్డీవోగా నియమించారు. ఇది డిప్యూటీ కలెక్టర్‌ క్యాడర్‌ పోస్ట్‌. ఈ మార్పులు రెవెన్యూ శాఖను కుదిపేశాయి.


భూభారతిని పట్టించుకోలేదనే?

భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక ప్రభుత్వం ఆ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని భావించింది. రాష్ట్ర స్థాయి అధికారులు ఇస్తున్న ఉత్తర్వులు జిల్లాల్లో ఆచరణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏ విషయం గురించి అయినా పదే పదే చెప్పినా మాట వినే పరిస్థితిలో అధికారులు లేరనే అసంతృప్తితో ఉన్న రెవెన్యూ శాఖ కీలక అధికారి షాక్‌ ట్రీట్‌మెంట్‌కు సిద్ధమయ్యారు. ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ అవసరాల రీత్యా జూనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించక తప్పలేదనే చర్చ కూడా జరుగుతోంది. అధికారులు సక్రమంగా స్పందించి.. భూ సమస్యల పరిష్కారంలో చురుగ్గా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం కూడా రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 09 , 2026 | 05:00 AM