kumaram bheem asifabad-ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం తగదు
ABN , Publish Date - Jun 02 , 2026 | 10:48 PM
: కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించిన ప్రజాపాలన సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆదివాసీ ఎమ్మెల్యే అయిన తనను అవమానపర్చడం తగదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండి పడ్డారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళశారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జిల్లాకు వస్తున్నాడంటే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఎంతో సంతోష పడ్డారని చెప్పారు. అయితే తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వక పోవడం దారుణం అన్నారు.
ఆసిఫాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించిన ప్రజాపాలన సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆదివాసీ ఎమ్మెల్యే అయిన తనను అవమానపర్చడం తగదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండి పడ్డారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళశారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జిల్లాకు వస్తున్నాడంటే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఎంతో సంతోష పడ్డారని చెప్పారు. అయితే తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వక పోవడం దారుణం అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సభ అధ్యక్షత బాధ్యతలు కాకుండా పక్క జిల్లా ఎమ్మెల్యేకు ఇవ్వడం కనీస ప్రొటోకాల్ సీఎంకు తెలియలేదని తెలిపారు. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడంటూ ఎద్దేవా చేశారు. గతంలో తాము శంకుస్థాపనలు చేసిన పనులకే ముఖ్యమంత్రి మళ్లీ శంకుస్థాపనలు చేశారని అన్నారు. కాంఎగ్రస్ నాయకులకు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా పోయిందన్నారు. స్థానిక సమస్యలపై ముఖ్యమంత్రి మాట్లాడక పోవడంతో ఆయన పర్యటనకు అర్థం లేకుండా పోయిందన్నారు. మెడికల్ కళాశాలలో 116 మంది సిబ్బందికి 12 మంది మాత్రమే ఉన్నారని దీంతో మెడికల్ కళాశాల స్థాపన ఉద్దేశమే దెబ్బతిన్నదన్నారు. జిల్లాలో పలు గ్రామాలకు మౌలిక వసతులు లేవని ఆవేధన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ నాయకులకు సమస్యలపై కనీస పట్టింపు కూడా లేదని పక్క జిల్లాకు చెందిన నేతకు సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఆరు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా రెండు వందలు కూడా పూర్తి కాలేదని వివరించారు. సీఎం పర్యటన ఊకదంపుడు ఉపన్యాసంలా ఉందన్నారు. జిల్లాలో గతంలో తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుతానికి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు వచ్చిన నిధులు కూడా ప్రస్తుత ప్రభుత్వంలో తమకు రావడం లేదని చెప్పారు. దీంతో ప్రజలకు ఏమి చేయలేక పోతున్నానన్నారు. నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు సీఎంకు చెప్పడానికి ప్రణాళిక రూపొందించుకున్నానని వివరించారు. నియోజక వర్గ ప్రథమ పౌరురాలిగా తనకు కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. సీఎం వస్తున్నాడు అంటే జిల్లాకు 100 కోట్లతో కొత్త పనులకు శంకుస్థాపన చేస్తాడని భావించానని వాపోయారు. పాత పనులకు తిరిగి ఆయనతో శంకుస్థాపన చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. పద్మశ్రీ కనక రాజుకు ఇచ్చిన ఇంట్లో డీసీసీ అధ్యక్షురాలు ఉందని చెప్పారు. కనీస అద్దె కూడా ఇస్తుందా లేదా అని ఎద్దేవా చేశారు. పద్మశ్రీ పరిస్థితి అలా ఉందంటే సాధారణ ప్రజలకు ఆమె ఎలా మేలు చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీలను తిట్టడం పక్కన పెట్టి అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని హితవు పలికారు. . తనకు కనీస గౌరవం దక్కలేదని సభను వాక్ అవుట్ చేసి మధ్యలో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబీన్ అహ్మద్, కౌన్సిలర్లు బాలకృష్ణ, నాగుబాయి, సర్పంచ్‌లు పోచయ్య, రవీందర్, నాయకులు నిసార్, అశోక్, బలరాం తదితరులు పాల్గొన్నారు.