Share News

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు మిశ్రమ విధానమే పరిష్కారం

ABN , Publish Date - May 20 , 2026 | 04:06 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను ఉత్తర, దక్షిణ భారతం మధ్య వివాదంగా, ఘర్షణగా చూడకూడదని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు మిశ్రమ విధానమే పరిష్కారం

  • సమర్థ పాలన, జనాభా.. రెండింటి మిశ్రమంతో రూపకల్పన

  • 70 శాతం జనాభా.. 30 శాతం జనాభా నియంత్రణ,

  • ఎన్నికల సంఘం మాజీ సీఈవో ఎస్‌వై ఖురేషీ ప్రతిపాదన

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను ఉత్తర, దక్షిణ భారతం మధ్య వివాదంగా, ఘర్షణగా చూడకూడదని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న భయాందోళనలు హేతుబద్ధం, రాజ్యాంగబద్ధమైనవని అన్నారు. ‘‘రాష్ట్రాల ముందు కేంద్రం ఉంచిన జనాభా నియంత్రణ వంటి లక్ష్యాలను దక్షిణాది రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేశాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై దక్షిణాది నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలు న్యాయమైనవి. వాటిని ప్రాంతీయ భావోద్వేగంగా కొట్టిపారేయడానికి వీల్లేదు. దీన్ని ఒక జాతీయ సమస్యగా పరిగణించాలి’’అని వ్యాఖ్యానించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం సుందరయ్య 41వ స్మారకోపన్యాసంలో ‘నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ - సమాఖ్య భారత భవిష్యత్తు’ అంశంపై ఖురేషీ ప్రసంగించారు. ‘‘పునర్వ్యవస్థీకరణను మరో 15 ఏళ్లపాటు వాయిదా వేయచ్చు. ఇది అనుసరణీయమే. అయినా కొంత భారం ఉంటుంది. 50 ఏళ్ల నాటి జనగణన ఆధారంగా ఇప్పటి ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం సమంజసం కాదు’’అని విశ్లేషించారు. మిశ్రమ ప్రాతినిధ్యాన్ని రెండో ప్రత్యామ్నాయంగా సూచించారు. ‘‘జనాభాకు 70 శాతం మార్కులు. జనాభా నియంత్రణ, మహిళా అక్షరాస్యత, శిశు మరణాల నియంత్రణ వంటి వాటికి మరో 30 శాతం మార్కులు కేటాయించడం ద్వారా మిశ్రమ విధానాన్ని రూపొందించవచ్చు. ఇదే మెరుగైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాను’’అని తెలిపారు. రాజ్యసభ విషయంలోనూ జర్మనీ పార్లమెంట్‌ తరహాలో రాష్ట్రాల్లోని జన సంఖ్య ఆధారిత ప్రాతిపదికకు విలువ ఇస్తూనే మరింత సమన్వయంతో కూడిన ప్రాతినిధ్యానికి అవసరమైన నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా పెద్దల సభ నిజంగా రాష్ట్రాల హక్కుల పరిరక్షణ వేదికగా, సమాఖ్య స్వభావ సంరక్షణ వేదికగానూ ఉంటుందని వివరించారు. తద్వారా చిన్న, పెద్ద రాష్ట్రాలకు ఒకే తరహా ప్రాతినిధ్యం పద్ధతికి స్వస్తి చెప్పవచ్చన్నారు. ఈ సందర్భంగా ఖురేషీ హైదరాబాద్‌ను సమ్మిళిత సంస్కృతికి ఆలవాలంగా అభివర్ణించారు. భారతీయ భావనను హైదరాబాద్‌ ప్రతిఫలించినంతగా మరే నగరం అద్దం పట్టలేదని కొనియాడారు. ఉత్తర భారతం, దక్షిణ భారతం, తెలుగు, ఉర్దూ, బిర్యానీ, సాంకేతిక పరిజ్ఞానం, పాతకాలపు రాజసం, ఆధునిక పరిజ్ఞానం వంటి వైవిధ్యాలకు పుట్టినిల్లు హైదరాబాద్‌ అని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య త్యాగనిరతిని కొనియాడారు.

Updated Date - May 20 , 2026 | 04:06 AM