kumaram bheem asifabad-సరదాల ఈత.. కావొద్దు విషాదం
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:37 PM
ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు ఈత కోసం కొలనులు, చెరువులు దగ్గరికి వెళుతుంటారు. ఏటా ఈ వేసవి కాలంలోనే ఈతకు వెళ్లిన పిల్లలు మృత్యువాత పడిన సందర్భాలు చాలా చోటు చేసుకుంటుంటాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఈత కొట్టేందుకు సరదాగా వెళ్లే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనిస్తే ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. గ్రా
కాగజ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు ఈత కోసం కొలనులు, చెరువులు దగ్గరికి వెళుతుంటారు. ఏటా ఈ వేసవి కాలంలోనే ఈతకు వెళ్లిన పిల్లలు మృత్యువాత పడిన సందర్భాలు చాలా చోటు చేసుకుంటుంటాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఈత కొట్టేందుకు సరదాగా వెళ్లే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనిస్తే ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో యువత బావులు, ఇతర లోతు ఎక్కువగా ఉన్న నీటి ప్రాంతాల్లో ఈత కొట్టేందుకు వెళుతుంటారు. అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా పిల్లలు మృత్యువాత పడుతూ కన్నవారికి తీరని శోకం మిగులుస్తున్నారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నా, ఎక్కడో ఒక చోట విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లోతు తెలియక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. అనర్థాలు జరగక ముందే తల్లిదండ్రులు వారి పిల్లలపై దృష్టి సారించి నిత్యం ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. ఏటా ఈత కోసం వెళ్లి పిల్లలు మృతి చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా పెద్దవాగు, పెన్‌గంగా, ప్రాణహిత, ఆసిఫాబాద్ పెద్దవాగు, తదితర ప్రాజెక్టులతో పాటు ఇతర జలపాతాలున్నాయి. ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల్లో ఎంతో మంది మృతి చెందిన విషాద ఘటనలున్నాయి. కింది సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే అయినా తల్లిదండ్రులు, విద్యార్థులు, యువకులు, పిల్లలను ముఖ్యంగా వేసవి కాలంలో నీటి లోతు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా ఈనెల 28న కాగజ్‌నగర్ మండలంలోని ఆరెగూడకు చెందిన బాలుడుమహేశ్(13) అమ్మమ్మ గ్రామమైన పెంచికల్ పేట మండలలోని చేడ్వాయికి వెళ్లి కుంటలో పడి మృతి చెందాడు. పోలీసులుకేసునమోదుచేశారు. గత సంవత్సరం కూడా పెన్‌గంగా నదిలో స్నానానికి వెళ్లి లోతు ఎక్కువగా ఉన్న విషయం తెలియక ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు. ఇటీవల కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగు జగన్నాథపూర్ సమీపంలో ఈత కొట్టేందుకు వెళ్లి కాగజ్‌నగర్‌కు చెందిన అర్బాస్ మృతి చెందాడు.
పోలీసుల సూచనలు..
లోతు తెలియని ప్రదేశాల్లో ఈతకు వెళ్లొద్దు. మద్యం తాగి నీటిలోకి దిగడం ప్రమాదకం, ఈత రాని వారు నీటి దూరంగా ఉండాలి, పిల్లలను పెద్దల పర్యవేక్షణలోనే ఉండేలా చర్యలు చేపట్టాలి, ప్రమాదకర సూచనలు, హెచ్చరిక బోర్డులు ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలి.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి..
- నితికా పంత్, ఎస్పీ
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశాలున్నాయి. ఈత నేర్పించాలంటే సరైన పర్యవేక్షణలో ఉంచాలి. గ్రామాల్లో చెరువులు, బావులు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్లకుండా పిల్లలకు చదువు ఇతర సానుకూల కార్యకలాపాలపైనే దృష్టి పెట్టేలా చేయాలి. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.