విల్లాల పేరుతో 15 కోట్ల మోసం
ABN , Publish Date - May 27 , 2026 | 05:29 AM
విల్లాల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక మోసాల విభాగం...
పలువురి నుంచి వసూళ్లు
ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్‌పై కేసు నమోదు
హైదరాబాద్ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి) : విల్లాల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక మోసాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. ‘టెక్ హోమ్స్’ పేరుతో విల్లా ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు ప్రచారం చేసిన ఎస్‌వీఎం ఆదిత్యహోమ్స్ సంస్థ ప్రతినిధులపై పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం... ఖానామెట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెడదం రామారావును 2023లో ఆదిత్య హోమ్స్ సంస్థ ప్రతినిధులైన రంజిత, నితీష్ కుమార్ ఫోన్ ద్వారా సంప్రదించి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలో ‘టెక్ హోమ్స్’ పేరిట సుమారు 9 ఎకరాల్లో విల్లా ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 201 విల్లాలను తక్కువ ధరలకు అందిస్తున్నామని నమ్మబలికిన సంస్థ ప్రతినిధులు అవసరమైన అనుమతులు త్వరలో పొందుతామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొండాపూర్‌లోని ఆ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన రామారావు విల్లా నంబర్ 92 కొనుగోలుకు అంగీకరించినట్లు తెలిపారు. రూ.1.79 కోట్ల విలువైన విల్లా కోసం 2023 నవంబరు 27 నుంచి 2024 ఏప్రిల్ 6 వరకు చెక్కులు, ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం రూ.80 లక్షలు ఆ సంస్థ ఖాతాలకు చెల్లించినట్లు బాధితుడు పేర్కొన్నారు. అనంతరం రూ.100 స్టాంప్ పేపర్‌పై ఎంవోయూ ఇచ్చినట్లు తెలిపారు. తనతో పాటు ఇదే ప్రాజెక్టు పేరుతో మొత్తం 20 మంది బాధితుల నుంచి సుమారు రూ.15.10 కోట్ల వరకు సేకరించినట్లు ఫిర్యాదు చేశారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన భూమి సంస్థ పేరుపై నమోదు కాలేదని, ప్రస్తుతం అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు కూడా జరగడం లేదని బాధితుడు ఆరోపించారు. లేఅవుట్ అభివృద్ధి చేయకుండా తప్పుడు హామీలతో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 54/2026గా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.