Share News

Suspension of Rangareddy Sub Registror: రంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌-2పై వేటు

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:12 AM

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన సబ్‌రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Suspension of Rangareddy Sub Registror: రంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌-2పై వేటు

  • 2వేలకోట్ల భూమి రిజిస్ట్రేషన్‌పై మధుసూదన్‌రెడ్డి సస్పెన్షన్‌.. అక్రమంగా మక్తా మహబూబ్‌పేట భూముల రిజిస్ట్రేషన్‌

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించి ప్రభుత్వం విచారణ

  • అక్రమార్కులకు సబ్‌రిజిస్ట్రార్‌ సహకరించినట్లు వెల్లడి

  • సస్పెండ్‌ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన సబ్‌రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మక్తా మహబూబ్‌పేట భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలో జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌-2గా వ్యవహరిస్తున్న కె.మధుసూదన్‌రెడ్డిని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు బుధవారం సస్పెండ్‌ చేశారు. అంతేకాదు.. మధుసూదన్‌రెడ్డిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్‌పై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన విచారణ జరపాలని నిర్దేశించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబరు 44లో ఉన్న 43 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఓ ముఠా.. నకిలీ లింకు డాక్యుమెంట్లతో రాగా సబ్‌రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే రిజిస్ట్రేషన్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ గత డిసెంబరు 25న ‘రూ.2 వేల కోట్ల భూమి కబ్జాకు స్కెచ్‌’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.


సంతకాలు సరిపోలకపోయినా..

విచారణలో.. ప్రభుత్వ భూమిపై కన్నేసిన ముఠా చూపించిన సర్టిఫైడ్‌ దస్తావేజు(సీసీ), ఈసీలపై ఉన్న సంతకాలు.. ఆ కాలంలో హైదరాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన జాయింట్‌-1, లేదా జాయింట్‌-2 సంతకాలతో సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 1980లో కంప్యూటరైజ్డ్‌ ప్రింట్‌ రూపంలో ఈసీ ఇచ్చేవారు కాదు. అయినా.. ఆ ముఠా 1980 నాటిదిగా చెబుతూ కంప్యూటరైజ్డ్‌ ఈసీ పత్రాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌కు ఇచ్చింది. దీంతో సులభంగా గుర్తించే అవకాశం ఉన్న ఈ విషయంలోనూ సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేల్చారు. పైగా, నకిలీ యజమానులు చూపించిన మదర్‌ డాక్యుమెంట్‌ మీద, ఈసీ మీద సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం స్టాంపు కూడా లేదని గుర్తించారు. తద్వారా సర్టిఫైడ్‌ కాపీలు, ఈసీ పత్రాలు నకిలీవని తేల్చారు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి సంబంధించి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న కె.మధుసూదన్‌రెడ్డి.. లింక్‌ డ్యాక్యుమెంట్లను పరిశీలించకపోవడంతోపాటు యాజమాన్యాన్ని నిర్ధారించడంలో విఫలమయ్యారని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో ఐజీ హనుమంతు పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం రికార్డుల పరిశీలనలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. మదర్‌ డాక్యుమెంట్‌ (నంబరు 311/1967) నమోదు చేసిన బుక్‌-1 వాల్యూమ్‌ 173ను సేకరించేందుకు కనీసం సంప్రదించలేదని గుర్తించారు. పైగా వాల్యూమ్‌.. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఉందని తప్పుదారి పట్టించారు. వాస్తవానికి ఏ కేసులోనైతే ఈ వాల్యూమ్‌ను కోర్టుకు పంపారో.. ఆ కేసు 1971 జూలై 3నే పరిష్కారమైందని, కోర్టులో వాల్యూమ్‌ లేదని 2024 సెప్టెంబరు 23న రాసిన ఓ లేఖకు కోర్టు నుంచి సమాధానం వచ్చింది. కానీ, సబ్‌ రిజిస్ట్రార్‌ ఇవేమీ పట్టించుకోలేదని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నకిలీ దస్ర్తాల రిజిస్ట్రేషన్‌కు ముందు..హైదరాబాద్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ను సంప్రదించకపోవడం, తిరస్కరణ ఉత్తర్వు (269/2025)లో కీలక విషయాలను ప్రస్తావించకపోవడంతో న్యాయస్థానం తిరస్కరణను పరిగణనలోకి తీసుకోకుండా దస్తావేజును విడుదల చేయాలని ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.


పీడీ యాక్ట్‌ పెట్టాలని మంత్రి ఆదేశం

రంగారెడ్డి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్వాకంపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌కు అనుమతించిన మధుసూదన్‌రెడ్డిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ హనుమంతును మంత్రి ఆదేశించారు. దాంతోపాటు పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని, ఇలాంటి అధికారులను జైలుకు పంపాలని నిర్దేశించారు. అంతేకాకుండా జిల్లా రిజిస్ట్రార్‌ పైనా విచారణ జరపాలని, ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములైన వారిని, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని కూడా సస్పెండ్‌ చేయాలని ఐజీని మంత్రి ఆదేశించడం రిజిస్ట్రేషన్‌ శాఖలో చర్చనీయాంశమైంది. త్వరలోనే జిల్లా రిజిస్ట్రార్‌పైనా వేటు పడే అవకాశం ఉందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు.. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ముస్సోరిలో ఉన్న రంగనాథ్‌.. గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. వచ్చిన వెంటనే భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 04:12 AM