Nizamabad Jail: నిజామాబాద్ జైలర్ సస్పెన్షన్
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:20 AM
నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్థి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్‌ను సస్పెండ్ చేశారు.
మరో జైలర్ ఆదిలాబాద్‌కు బదిలీ
నెల రోజులు సెలవు పెట్టాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలు
ఇందూరు జిల్లా జైలులో గంజాయి గుప్పుపై ఉన్నతాధికారులు సీరియస్
ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా విచారణ
నిజామాబాద్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్థి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్‌ను సస్పెండ్ చేశారు. మరో జైలర్‌పై బదిలీ వేటు వేశారు. సూపరింటెండెంట్‌ను నెల రోజులు సెలవు పెట్టాలని ఆదేశించారు. ఈ నెల 1న ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి గుప్పు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐజీ మురళిబాబు, డీఐజీ సంపత్ ఈ నెల 3న నిజామాబాద్ సెంట్రల్ జైలులో విచారణ జరిపి డీజీకి నివేదిక అందజేశారు. దాని ఆధారంగా నిజామాబాద్ జిల్లా జైలు జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ డీజీ ఉత్తర్వులు ఇచ్చారు. వరంగల్ సెంట్రల్ జైలులో పోస్టింగ్‌లో ఉంటూ నిజామాబాద్ జైలులో అటాచ్‌మెంట్ కింద పనిచేస్తున్న జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. వరంగల్ జైలర్‌గా పనిచేస్తున్న పూర్ణచందర్‌కు నిజామాబాద్ జైలర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. నెలు రోజులు సెలవు పెట్టాలని నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్ దశరథంకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనంద్ రావుకు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. జైలు అధికారులతో కలిసి పనిచేసినట్లు తేలిన కొందరు ఖైదీలను ఇతర జైళ్లకు మార్చారు.
మూడేళ్లుగా జైలర్ల అక్రమాలు
నిజామాబాద్ జైలర్‌గా మూడేళ్లుగా పనిచేస్తున్న ఉపేందర్‌రావుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. జైలులోకి గుట్కా, పాన్, సిగరెట్లు, బీడీలు సరఫరా చేస్తున్న విషయంలో జైలరే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గేట్ ఇన్‌చార్జ్‌గా జైలరే ఉండటంతో కిచెన్ స్టాఫ్ ద్వారా ఈ నిషేధిత పదార్థాలను ఖైదీలకు చేరవేసినట్లు సమాచారం. ఉపేందర్‌రావుతో పాటు మరో జైలర్‌గా పనిచేస్తున్న సాయిసురేశ్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల జైలులోకి గంజాయి ప్యాకెట్లు రాగా, ఆ విషయంలో జైలర్ ఉపేందర్‌రావు ఇద్దరు ఖైదీలను చితకబాదారు. వారు వీసీ ద్వారా జిల్లా న్యాయాధికారికి విషయం తెలిపారు. దీంతో బోధన్ కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశాలు ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉపేందర్‌రావు అరాచకాలు భరించలేక ఇద్దరు ఖైదీలు తమను మరో జైలుకు మార్చాలని వేడుకున్నారు. దీంతో వారిని కామారెడ్డి జైలుకు మార్చారు. విచారణలో కామారెడ్డి జైలులో ఉన్న ఆ ఇద్దరు ఖైదీలతో ఉన్నతాధికారులు మాట్లాడారు. ములాఖత్‌ల విషయంలోనూ ఉపేందర్‌రావు అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఖైదీల బంధువుల నుంచి డబ్బు తీసుకుని పరిమితికి మించి ములాఖత్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.