గూడూరు గురుకుల ప్రిన్సిపాల్, వార్డెన్‌పై వేటు
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:22 AM
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రేణుక, వార్డెన్ మల్లేశ్వరీలపై సస్పెన్షన్ వేటు పడింది.
క్షుద్ర పూజలు, సమస్యల నేపథ్యంలో వేటు
పాలకుర్తి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రేణుక, వార్డెన్ మల్లేశ్వరీలపై సస్పెన్షన్ వేటు పడింది. గురుకులంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన క్షుద్ర పూజల ఘటన, పాఠశాలలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో గురుకులాల సెక్రటరీ డీఎస్ వెంకన్న బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనకు పీడకలలు వస్తున్నాయని, పూజలు చేస్తే రావని ప్రిన్సిపాల్ రేణుక ఇటీవల ట్రాన్స్ జెండర్లతో కలిసి పాఠశాలలో క్షుద్ర పూజలు చేయించారు. పసుపు, కుంకుమ కలిపిన నీళ్లను విద్యార్థులందరిపైన చల్లించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. విచారణకు ఆదేశించడంతో గురుకులాల సెక్రటరీ డీఎస్ వెంకన్న విచారణ చేపట్టి ఇరువురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.