ముఖ్యమంత్రి కాగానే..కళ్లు నెత్తికెక్కాయా?
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:18 AM
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా..
రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపాదించింది కొండా దంపతులే
మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారు
డైపర్లతో తిరిగే రేవూరిని మళ్లీ గెలిపిస్తారా?
మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు
గీసుగొండ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా మొట్టమొదట ప్రతిపాదించి జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లింది కొండా దంపతులేనని, కొన్ని కారణాల వల్ల ఉత్తమ్‌కుమారెడ్డికి బదులు రేవంత్‌రెడ్డిని ప్రతిపాదించాల్సి వచ్చిందని అన్నారు. కానీ.. ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు కళ్లు నెత్తికెక్కాయన్నారు. రాష్ట్రంలో అచ్చమైన కాంగ్రెస్ లేదని, అంతా పచ్చ కాంగ్రెస్ హవా నడుస్తోందని వ్యాఖ్యానించారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ క్రాస్‌రోడ్ వద్ద నిర్వహించిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక మా ఇంటికి వచ్చి 35 నుంచి 38 ఎమ్మెల్యే సీట్లు వస్తే మా నాన్న కొండా మురళికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానన్నారు. ఆ తరువాత మోసం చేశారు. సీనియర్ నాయకులైన దయాసాగర్, షబ్బీర్ అలీ లాంటి వారిని అధ్యక్ష పదవి కోసం కార్లలో తిప్పుకొని.. సీఎం అయ్యాక వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడంలేదు. మీకు సహాయం చేసినవారు గుర్తుకురావడం లేదా? సీఎం కాగానే కళ్లు తలకెక్కాయా?’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పొంగులేటి ఫొటోలు పెట్టుకొని.. అక్కడ ఇన్‌చార్జి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ ఫొటోలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పార్టీతో సంబంధం లేని సీతా దయాకర్‌రెడ్డికి కార్పొరేషన్ పదవి ఎలా ఇస్తారని నిలదీశారు. పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డ తన తండ్రికి అన్యాయం చేస్తున్నారని, బీసీ నాయకులను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.
కొండా దంపతులతో పెట్టుకోవద్దు..
కొండా దంపతులతో పెట్టుకోవద్దని, కుర్చీ కాపాడుకోవాలంటే జాగ్రత్తగా వ్యవహరించాలని సుస్మిత హెచ్చరించారు. బీసీ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని అన్నారు. సీఎం సలహాదారుగా నియమించుకున్న వేం నరేందర్‌రెడ్డి ఇచ్చిన సలహాలేంటని ప్రశ్నించారు. సీఎం సోదరుడు షెల్ కంపెనీ పెట్టుకుంటే రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టే సలహా నరేందర్‌రెడ్డి ఇచ్చాడా? అని నిలదీశారు. మంత్రులు స్వతంత్రంగా సంతకాలు చేయలేకపోతున్నారని తెలిపారు. తనకెవరైనా కౌంటర్లు ఇస్తే.. వారి చిట్టా మొత్తం బయట పెడతానని హెచ్చరించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి టికెట్‌ను ఏఐసీసీ చూసుకుంటుందన్న సీఎం.. పరకాల సభలో మాత్రం ఎమ్మెల్యే రేవూరి ప్రకా్‌షరెడ్డి పేరును ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. అలాంటప్పుడు 119 నియోజకవర్గాలకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చెప్పాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, 21 ఏళ్లకు ఎమ్మెల్యేలుగా గెలవాలని అంటున్న సీఎం.. వృద్ధుడు, డైపర్లతో తిరిగే రేవూరిని మళ్లీ గెలిపించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సుస్మిత వ్యాఖ్యానించారు. ‘టీడీపీ సభ్యులంటే మీకు అంత ప్రేమ ఎందుకు? 10 ఏళ్లు నేను సీఎంను అని చెబుతున్నావు. దివంగత రాజశేఖర్‌రెడ్డి కూడా అలా చెప్పుకోలేదు’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్ సీఎంలే ఉంటారని తెలియదా? అని ప్రశ్నించారు. రేవూరితో ఇప్పుడే రాజీనామా చేయించి మళ్లీ గెలిపించాలని సవాల్ విసిరారు. తమ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నారు. ఈసారి ఎమ్మెల్యే తానే అవుతానని, 20 ఏళ్లు కొనసాగుతానని సుస్మిత ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. పరకాలలో అనుకోకుండా ఎన్నికలు కూడా రావచ్చునేమోనన్నారు. రేవూరి తమ సహకారంతోనే గెలిచారన్న విషయాన్ని మరిచిపోయారని విమర్శించారు.