బంగారం కాదు.. బంగారు పూత
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:03 AM
గోల్డ్‌మ్యాన్ విజయ్‌కుమార్ సెల్‌ఫోన్‌లో సూర్యాభాయ్ పేరుతో ఉన్న ఫోన్ నంబర్, ఫొటోలను గుర్తించిన ఐటీ అధికారులు అతని గురించి ఆరా తీశారు.
సూర్యాభాయ్ ఒంటిపై ఉన్న ఆభరణాల విలువ రూ. 3లక్షలు మాత్రమేనని తేల్చిన ఐటీ అధికారులు
నా ఒంటిపై ఉన్నది ఒరిజినల్ బంగారమే: సూర్యాభాయ్
రాజేంద్రనగర్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గోల్డ్‌మ్యాన్ విజయ్‌కుమార్ సెల్‌ఫోన్‌లో సూర్యాభాయ్ పేరుతో ఉన్న ఫోన్ నంబర్, ఫొటోలను గుర్తించిన ఐటీ అధికారులు అతని గురించి ఆరా తీశారు. సూర్యాభాయ్ అలియాస్ ఓల్డ్‌సిటీ సూర్యాభాయ్‌ను ఐటీ అధికారులు విచారించిగా.. అతని ఒంటిపై 32 సెట్ల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే అదంతా బంగారం కాదని, బంగారు పూత అని తేల్చారు. వాటి విలువ రూ. 3 లక్షలు మాత్రమే అని నిర్ధారించారు. ఈ విషయమై ఓల్డ్‌సిటీ సూర్యాభాయ్ స్పందించారు. తన ఒంటిపై ఉన్నది ఒరిజినల్ బంగారమేనని స్పష్టం చేశారు. అత్తాపుర్‌లోని వాసుదేవరెడ్డినగర్ కాలనీలో ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగారం వేసుకోవడం తన ఫ్యాషన్ అని చెప్పారు. తన ఒంటిపై ఉన్నదంతా బంగారమే అని, అయితే అందులో పూర్తిగా బంగారం ఉండదని, అన్ని కలిపి తయారు చేస్తారన్నారని తెలిపారు. తాను బంగారం వేసుకోవడం అమ్మ కోరిక అని చెప్పారు. ఐటీ అధికారులు తనను విచారించింది నిజమేనన్నారు. వారు అడిగినట్లుగా తాను వేసుకున్న బంగారానికి సంబంధించిన పత్రాలను వారికి చూపిస్తానని చెప్పారు. కాగా, శేరిలింగంపల్లికి చెందిన గోల్డ్‌మ్యాన్ విజయ్‌కుమార్ తన ఒంటిపై సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో ఐటీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.