Share News

మిగులు.. దిగులు

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:42 AM

జిల్లాలో ఇంజనీరింగ్‌ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ఆయా కోర్సుల్లో ఆశించిన విధంగా విద్యార్థులు చేరడం లేదు. ఈసారి పలు కళాశాలల్లో చెప్పుకోతగిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇటీవల ఎప్‌సెట్‌కు సంబంధించిన తుది కౌన్సెలింగ్‌ ప్రక్రియ, సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈనెల 13 వరకు కోర్సుల మార్పులు చేర్పులకు

మిగులు.. దిగులు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌ )

జిల్లాలో ఇంజనీరింగ్‌ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ఆయా కోర్సుల్లో ఆశించిన విధంగా విద్యార్థులు చేరడం లేదు. ఈసారి పలు కళాశాలల్లో చెప్పుకోతగిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇటీవల ఎప్‌సెట్‌కు సంబంధించిన తుది కౌన్సెలింగ్‌ ప్రక్రియ, సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈనెల 13 వరకు కోర్సుల మార్పులు చేర్పులకు సంబంధించిన స్లైడింగ్‌ పూర్తవనుంది. ఆయా బ్రాంచీల్లో చేరిన వారు తుది ఆప్షన్‌కు అనుగుణంగా ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించనున్నారు.

ఫ భర్తీ అయినవి 54 శాతమే..

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు కలిపి 12 ఉన్నాయి. ఇందులో పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నాచుపల్లి, సిరిసిల్ల జిల్లా ఆగ్రహారం వద్ద జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. గతేడాది నుంచి శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో హుస్నాబాద్‌లో మరో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైంది. ఈ నాలుగు కాకుండా మరో 8 ప్రైవేటు కళాశాలలున్నాయి. వీటిలో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి మొత్తంగా 4,714 కన్వీనర్‌ కోటా సీట్లున్నాయి. ఇందులో కౌన్సెలింగ్‌ ద్వారా 2,560 మంది మాత్రమే ఆయా కోర్సుల్లో చేరారు. మిగతా 2,154 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 54 శాతం సీట్లు నిండాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవడంతో మిగులు సీట్ల భర్తీ అనేది ఈసారి కష్టసాధ్యమే... గత ఏడాది 3,451 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సారి గతానికన్నా 1297 మంది విద్యార్థులు తగ్గారు.

ఫ సంప్రదాయ కోర్సులకు స్వస్తి

ఒకప్పుడు ఇంజినీరింగ్‌ విద్యపై విద్యార్థులకున్న క్రేజీ కాలక్రమంగా తగ్గుతుందనేందుకు ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. చేరికలు తగ్గడంతో పలు ప్రైవేటు కళాశాలలు మూతబడ్డాయి. సివిల్‌ ఇంజీనిరింగ్‌, ఐటీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లాంటి కోర్సులను గడిచిన ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విద్యార్థులు ఎంచుకోవడం లేదు. దీంతో సంప్రదాయ కోర్సులకు స్వస్తి పలుకుతూ కొత్త కోర్సులపై మక్కువ చూపిస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈసారి సివిల్‌ ఇంజినీరింగ్‌లో 247 సీట్లు ఉండగా 129 మంది, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 313 సీట్లకుగానూ 134 మంది మాత్రమే చేరారు. ట్రిపుల్‌ ఈలో 224, ఈసీఈలో 420 మంది చేరారు.

ఫ సీఎస్‌ఈకి డిమాండ్‌..

ఎప్పటిలాగే ఈ విద్యాసంవత్సరంలో సీఎస్‌ఈ (కంప్యూటర్‌ స్సైన్స్‌ ఇంజినీరింగ్‌) కోర్సును యువత ఆదరించారు. మొత్తం 2,560 సీట్లు భర్తీ అయితే అందులో 980 మంది విద్యార్థులు ఈ కోర్సునే ఎంచుకున్నారు. మొత్తం సీట్లలో 38 శాతం సీఎస్‌ఈనే ఎంచుకున్నారు. ఇక ఆ తరువాత ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సులో 500 మంది చేరారు. ముఖ్యంగా సీఎస్‌ఎం (కంప్యూటర్‌ స్సైన్స్‌ ఇంజినీరింగ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆండ్‌ మెషిన్‌ లర్నింగ్‌), సీఎస్‌ఏ (కంప్యూటర్‌ స్సైన్స్‌ ఇంజనీరింగ్‌ ఆండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌)ను ఎక్కువ మంది ఎంపిక చేసుకున్నారు.

ఫ యాజమాన్య కోటా ఊసేది..?

ఒకప్పుడు నచ్చిన కళాశాలలో మెచ్చిన కోర్సు దొరకడమనేది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కష్టసాధ్యమైన విషయం. మంచి ర్యాంక్‌ వస్తేనే పేరొందిన కళాశాలలో సీటు దొరుకుతుందనే పరిస్థితి ఉండేది. లేకపోతే రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వెచ్చించి ఇంజినీరింగ్‌ సీటును యాజమన్య కోటాలో పొందడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధపడేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. లక్షకుపైగా ర్యాంక్‌ వచ్చిన వారికి కూడా అవలీలగా కన్వీనర్‌ కోటాలో సీటు లభిస్తుండటంతో యాజమాన్య కోటాకు డిమాండ్‌ తగ్గింది. ప్రతి కోర్సులో 30 శాతం సీట్లను ఆయా కళశాలల యాజమాన్యం నేరుగా భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్రైవేటు కళాశాలల్లో 1200కుపైగా సీట్లు యాజమాన్య కోటావి ఉన్నాయి. దీంతో ఈ సారి అసలు వీటిలో ఎన్ని సీట్లు నిండుతాయోననే సందిగ్ధంలో కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి.

Updated Date - Aug 13 , 2026 | 01:42 AM