Share News

ఒక సెమిస్టర్‌ ఏడాదికి సమానం కాదు

ABN , Publish Date - Jul 14 , 2026 | 06:16 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చేపట్టిన మండల ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎంపీఎస్‌వో/ఏఎస్‌వో) నియామకాల వ్యవహారంలో బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) అభ్యర్థులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది.

ఒక సెమిస్టర్‌ ఏడాదికి సమానం కాదు

  • ఆరు నెలలను విద్యాసంవత్సరంగా పరిగణించలేం

  • మాకూ బాధగానే ఉందిగానీ.. నిబంధనలు పక్కనపెట్టి నిపుణుల కమిటీ నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలేం

  • ఎంపీఎస్‌వో/ఏఎస్‌వో అభ్యర్థుల కేసులో సుప్రీం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చేపట్టిన మండల ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎంపీఎస్‌వో/ఏఎస్‌వో) నియామకాల వ్యవహారంలో బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) అభ్యర్థులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. డిగ్రీలో కనీసం ఏడాదిపాటు స్టాటిస్టిక్స్‌ చదివి ఉండాలన్న నిబంధన ఉన్నప్పుడు.. కేవలం ఒక సెమిస్టర్‌ (6నెలలు) మాత్రమే ఆ సబ్జెక్టును చదివిన అభ్యర్థులను అర్హులుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. 474 ఎంపీఎస్‌వో/ఏఎస్‌వో పోస్టుల భర్తీకి.. టీజీపీఎస్సీ 2018లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యర్థులు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టును ఒక పేపర్‌గా కనీసం ఏడాది పాటు చదివి ఉండాలనే నిబంధన పెట్టింది. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం ఈ పోస్టులకు పోటీ పడ్డారు. అయితే, వారు నాలుగేళ్ల కోర్సులో కేవలం ఒక్క సెమిస్టర్‌ (6నెలలు) మాత్రమే ‘ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌’ సబ్జెక్టును చదివినట్లు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో కమిషన్‌ గుర్తించింది. ఒక సెమిస్టర్‌ చదవడం ఒక పూర్తి విద్యాసంవత్సరానికి సమానం కాదంటూ, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కమిషన్‌ వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ 2019లో రిజెక్షన్‌ మెమోలు జారీచేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వై.జగదీశ్‌ సహా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 2024 డిసెంబర్‌లో సింగిల్‌ జడ్జి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ కమిషన్‌ హైకోర్టులో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ వివాదాస్పద కేసును హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎమ్‌. మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించి.. టీజీపీఎస్సీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును జగదీశ్‌ సహా 13 మంది 2026 మే 8వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.


ఏపీలో ఆమోదం.. ఇక్కడెందుకు అభ్యంతరం?

టీజీపీఎస్సీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఉత్తమ ర్యాంకులు సాధించినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. బీటెక్‌ అభ్యర్థులు తమ కోర్సులో భాగంగా ఒక సెమిస్టర్‌ (6 నెలలు) పాటు స్టాటిస్టిక్స్‌ చదివారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాతపరీక్షలో వీరు 7వ ర్యాంకు లాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. ఉద్యోగానికి అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించిందని, చివరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మాత్రం అనర్హులుగా తేల్చిందని పేర్కొన్నారు. సెమిస్టర్‌ విధానంలో ఏడాది సిలబ్‌సను 6 నెలలకే కుదించి బోధిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లో అకడమిక్‌ నిపుణుల కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపిన విషయాన్ని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో అంగీకరించి, తెలంగాణలో మాత్రం అభ్యంతరం తెలుపుతున్నారని పేర్కొన్నారు. అయితే.. అకడమిక్‌ అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీలదే తుది నిర్ణయమని ధర్మాసనం తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ అభిప్రాయాన్ని కాదని న్యాయస్థానాలు తమ సొంత అభిప్రాయలను, నిర్ణయాలను అమలు చేయలేవని స్పష్టం చేసింది. ‘‘రూల్స్‌లో చాలా స్పష్టంగా ‘ఒక ఏడాది’ అని ఉంది. కేవలం ఒక సెమిస్టర్‌ మాత్రమే చదివి ఆ నిబంధనను పూర్తి చేశామని మీరు అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ అకడమిక్‌ నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను మేము ఇక్కడ గుర్తు చేయాలని అనుకుంటున్నాం. ఒక అకడమిక్‌ ఇయర్‌ అంటే 12 నెలలు లేదా రెండు సెమిస్టర్లు అని ఆ కమిటీ తన రిపోర్ట్‌లో తేల్చి చెప్పింది. ఫౌండేషన్‌ కోసం కేవలం ఆరు నెలలు (ఒక సెమిస్టర్‌) చదివిన సబ్జెక్టును, ఏడాది మొత్తం చదివినట్టుగా ఎలా అనుకుంటాం? అలా పరిగణించలేమని కమిటీ స్పష్టంగా చెప్పిన విషయాన్నే గుర్తు చేస్తున్నాం. అభ్యర్థులు రాతపరీక్షలో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ.. కేవలం ఈ నిబంధన వల్లే ఉద్యోగాలు కోల్పోతుండటం చూస్తే మాకు చాలా బాధగా ఉంది. వారిపై మాకు పూర్తి సానుభూతి ఉంది. ఇదొక కఠినమైన పరిస్థితే (హార్డ్‌ కేస్‌) కావచ్చు. కానీ, నిబంధనలను పక్కనపెట్టి, అకడమిక్‌ నిపుణుల కమిటీలు తీసుకున్న నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలేము. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది.

Updated Date - Jul 14 , 2026 | 06:17 AM