Share News

తుది తీర్పునకు లోబడే లైబ్రేరియన్‌ నియామకాలు

ABN , Publish Date - May 05 , 2026 | 03:56 AM

వర్సిటీల ప్రాంతీయ పరిధికి వెలుపల ఉన్న దూరవిద్యా కేంద్రాలు ఇచ్చే డిగ్రీలు ఉద్యోగార్హత కల్పించవంటూ టీజీపీఎస్సీ అభ్యంతరం లేవనెత్తిన నేపథ్యంలో...

తుది తీర్పునకు లోబడే లైబ్రేరియన్‌ నియామకాలు

  • దూరవిద్య డిగ్రీల అంశంలో తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

  • 8 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశం

న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి) : వర్సిటీల ప్రాంతీయ పరిధికి వెలుపల ఉన్న దూరవిద్యా కేంద్రాలు ఇచ్చే డిగ్రీలు ఉద్యోగార్హత కల్పించవంటూ టీజీపీఎస్సీ అభ్యంతరం లేవనెత్తిన నేపథ్యంలో... తెలంగాణలో లైబ్రేరియన్‌ పోస్టుల నియామకాలు తన తుది తీర్పునకు లోబడే ఉంటాయని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అసలేం జరిగిందంటే.. 2022లో టీజీపీఎస్సీ 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో కొందరు ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధికి వెలుపల ఉన్న స్టడీ సెంటర్ల ద్వారా ‘మాస్టర్స్‌ ఇన్‌ లైబ్రరీ సైన్స్‌’ పూర్తి చేసినట్లు తేలింది. నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం.. వర్సిటీ ప్రాంతీయ పరిధికి బయట నిర్వహించే దూరవిద్య కేంద్రాల డిగ్రీలు చెల్లవని పేర్కొంటూ టీజీపీఎస్సీ వారి అభ్యర్థిత్వాన్ని నిరాకరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ అభ్యర్థులు తొలుత హైకోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో టీజీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లడంతో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం.. నిబంధనలను సమర్థిస్తూ అభ్యర్థుల విన్నపాన్ని తోసిపుచ్చింది. హైకోర్టు సీజే తీర్పును ఏప్రిల్‌ 16న విజయచంద్రారెడ్డితోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఎన్వీ అంజారియాల ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ల న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘‘2017లో టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఇవే దూరవిద్య సర్టిఫికెట్లను ఆమోదించారు. 2022 నోటిఫికేషన్‌కు వచ్చేసరికి యూజీసీ నిబంధనల పేరుతో ఆ వర్సిటీలు తెలంగాణ వెలుపల ఉన్నాయంటూ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం ఏకపక్షమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో అభ్యర్థులు అర్హతను కోల్పోవడం సమంజసం కాదు’’ అని పేర్కొన్నారు. దర్మాసనం స్పందిస్తూ.. ‘‘2013లో యూజీసీ పబ్లిక్‌ నోటీసు స్పష్టంగా ఉంది. ఒక రాష్ట్ర చట్టం ద్వారా ఏర్పాటైన ఏ విశ్వవిద్యాలయమైనా ఆ రాష్ట్ర సరిహద్దుల లోపలే కార్యకలాపాలు సాగించాలి. తాము చదువుతున్న కోర్సులకు, ఆయా స్టడీ సెంటర్లకు చట్టబద్థ సంస్థల గుర్తింపు ఉందో లేదో చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత విద్యార్థులదే. ఆ గుర్తింపు లేనప్పుడు, ఆ సర్టిఫికెట్లను విద్యార్హతలుగా ఎలా పరిగణిస్తారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా ఈ అంశంపై ఎనిమిది వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జులై 29కి వాయిదా వేసింది.

Updated Date - May 05 , 2026 | 03:56 AM