Supreme Court Suggests: కూర్చుని మాట్లాడుకోండి!
ABN , Publish Date - Jan 06 , 2026 | 03:07 AM
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే సామరస్యపూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడమే ఉత్తమమని సుప్రీంకోర్టు పేర్కొంది.
గోదావరి జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి
తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు సూచన
వరద జలాల పేరుతో ఏపీ అక్రమంగా 200 టీఎంసీలు తరలించే యత్నం
ఈ నెల 2నే కేంద్రం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది.. 3 నెలల్లో నివేదిక
అప్పటివరకు స్టే ఇవ్వండి: తెలంగాణ
నిబంధనల మేరకే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు.. ఏపీ వాదనలు
జల వివాదాల పరిష్కారానికి 3 మార్గాలు సూచించిన ధర్మాసనం.. 12కు వాయిదా
న్యూఢిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే సామరస్యపూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడమే ఉత్తమమని సుప్రీంకోర్టు పేర్కొంది. లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని తెలంగాణకు సూచించింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం హైపవర్ కమిటీని వేసినందున.. దానిముందే అభ్యంతరాలు చెప్పుకొంటే సరిపోతుందని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ’పోలవరం- నల్లమల సాగర్‘ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ (సివిల్)ను సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. వరద జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీలను అక్రమంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ‘‘ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి బేసిన్‌లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుంది. ఇది వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర’’ అని సింఘ్వీ వాదనలు వినిపించారు.
ప్రాజెక్టు పనులను నిలువరించాలి..
ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపాలని, అనుమతుల్లేకుండా ముందుకు వెళ్లొద్దని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని సింఘ్వీ గుర్తు చేశారు. కేంద్రం అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రం పరిశీలించడం సమంజసం కాదన్నారు. ఈ అంశంపై ఇదివరకే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, జల వనరుల సంఘానికి లేఖలు రాశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014కు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును నిలువరించాలని వాదనలు వినిపించారు. ఇంతలో సీజేఐ జోక్యం చేసుకుంటూ.. ఇది జల వివాదానికి సంబంధించిన అంశమా? అని ప్రశ్నించారు. దీంతో.. ఇది జల వివాదం కాదని, కానీ.. గోదావరి నదీ జలాల పంపకాలు ఇప్పటికే జరిగిపోయాయని, కేటాయింపులు పూర్తయ్యాయని సింఘ్వీ బదులిచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్.. పోలవరం-నల్లమల సాగర్ పేరుతో విభజన చట్టం, జీడబ్ల్యూడీటీ, ఇతర నిబంధనలను ఉల్లంఘిస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చేవరకూ స్టే ఇవ్వండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ నెల 2న హై పవర్ కమిటీని ఏర్పాటు చేసిందని అభిషేక్ సింఘ్వీ తెలిపారు. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వనుందని, అప్పటివరకూ పోలవరం- నల్లమల సాగర్(బనకచర్ల) లింక్ ప్రాజెక్టు పనులను ఆపేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డులో ఉమ్మడి ఏపీకి 1,468 టీఎంసీలు కేటాయించిందని, అందులో తెలంగాణకు 968 టీఎంసీలు దక్కాయని తెలిపారు. అయితే, ఏపీ వరద జలాల పేరుతో అక్రమంగా 200 టీఎంసీల అదనపు నీళ్లను తరలించాలని చూస్తోందన్నారు. దీనిపై సీజేఐ మరోసారి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ చేపట్టబోయే ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టమేంటని ప్రశ్నించారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని సింఘ్వీ చెప్పారు. ఏపీ మిగులు/వరద జలాలను వినియోగించుకుంటామంటోందని, అయితే, దేశంలో ఇప్పటికీ ఎక్కడా సముద్రంలో కలిసే మిగులు/వరద జలాల లెక్కలు లేవని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ చేపడుతున్న లింక్ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖ అనుమతుల్లేవని పునరుద్ఘాటించారు. అయినా ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమల సాగర్ కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపైౖనే తెలంగాణకు అభ్యంతరమని చెప్పారు.
సముద్రంలో కలిసే నీళ్లనూ వాడుకోకూడదా?
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిబంధనలూ ఉల్లంఘించలేదని ఏపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘మా ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది. పీఎఫ్‌ఆర్, డీపీఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. నిర్మాణాలు చేయడం లేదు. ఫీజిబిలిటీ రిపోర్టు తయారు చేస్తే తెలంగాణకు ఎందుకు అభ్యంతరం? భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు కోసం నివేదికను సిద్ధం చేసుకుంటే అడ్డుకోవడం సరికాదు. మా భూభాగంలో చేపట్టే ప్రాజెక్టుకు నివేదిక తయారు చేసుకుంటే మీకెందుకు అభ్యంతరం? సీమలో కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించాం. చివరికి అనుమతి ఇవ్వాల్సింది కేంద్రమే కదా?’’ అని రోహత్గీ వాదనలు వినిపించారు. దీంతో సీజేఐ జోక్యం చేసుకుంటూ.. పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి కదా? అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ప్రాజెక్టుతో ఏ ఒక్క పరివాహక రాష్ట్రానికి నష్టం వాటిల్లదని రోహత్గీ నివేదించారు. ఏపీ తరఫు మరో న్యాయవాది జైదీప్ గుప్తా జోక్యం చేసుకొని.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, ప్రస్తుతం చేపడుతున్న పోలవరం- నల్లమల్ల సాగర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు అని తెలిపారు. ‘‘గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని రాయలసీమకు అందించాలన్నదే మా ఉద్దేశం. ఇప్పటికే విభజనలో హైదరాబాద్‌ను తీసుకోవడంతో ఏపీకి తీరని నష్టం జరిగింది. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లనూ వాడుకోకూడదా? ప్రాజెక్టులను అడ్డుకుని మరింత అన్యాయం చేస్తారా? తెలంగాణ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా గోదావరిపై అనేక ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చా?’’ అని రోహత్గీ, జైదీప్ వాదనలు వినిపించారు.
సమగ్ర సివిల్ సూట్ దాఖలు చేయండి..
జల వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చేవరకు వేచి చూడాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారానికి వేసిన కమిటీ ముందు సమస్యను చెప్పుకోవడానికి ఉన్న అభ్యంతరం ఏమిటని తెలంగాణను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే, కమిటీ ముందు అన్ని అభ్యంతరాలను చెబుతామని సింఘ్వీ బదులిచ్చారు. అందుకే, ఆ కమిటీ నివేదిక ఇచ్చేవరకూ స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వాదనలపై సీజేఐ స్పందిస్తూ... పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ రిట్ పిటిషన్ విచారణార్హం కాదని అభిప్రాయపడ్డారు. అలాగే, తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న ఏపీ వాదనలపైనా సీజేఐ స్పందించారు. ‘‘ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు. కానీ, ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ఇప్పుడు ఆ ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం చేసిన ఖర్చు సంగతి ఏమిటి? ప్రజాధనం వృధా అయినట్టే కదా?’’ అని ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. మూడు ప్రధాన పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందుంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. కాగా, సుప్రీంకోర్టు మంచి సూచనలు ఇచ్చిందని సింఘ్వీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఖరారు చేస్తామని తెలిపారు. ఇందుకోసం వారంపాటు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సివిల్ సూట్ దాఖలు చేస్తే అప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక సహా గోదావరి నదీపరివాహకంగా ఉన్న ఇతర రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చాలని సీజేఐ సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు.
సీజేఐ సూచించిన పరిష్కార మార్గాలు..
1) ఇది రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదమైనందున.. ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం ’సివిల్ సూట్‘ దాఖలు చేయండి. అప్పుడు.. సాక్ష్యాధారాలతో సహా సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుంది.
2) కేంద్ర ప్రభుత్వం ఈ వివాదంపై హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనల్ని పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే (స్టే ఇచ్చే) ‘నిర్ణయాధికారాన్ని’ కమిటీకి కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంటుంది.
3) కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా.. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు.