Share News

సుప్రీం తీర్పు టీచర్ల ఉపాధికి ముప్పు

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:10 AM

ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయుల ఉపాధికి ముప్పుగా మారిందని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (ఏఐజేఏసీటీఓ) ఆందోళన వ్యక్తం చేసింది.

సుప్రీం తీర్పు టీచర్ల ఉపాధికి ముప్పు

  • ఢిల్లీలో ఏఐజేఏసీటీఓ ఆధ్వర్యంలో ధర్నా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయుల ఉపాధికి ముప్పుగా మారిందని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (ఏఐజేఏసీటీఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తీర్పు వెలువడిందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టాన్ని సవరించి, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతను కాపాడాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏఐజేఏసీటీఓ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సి.ఎన్‌. భారతి (ఎస్టీఎ్‌ఫఐ), కె. నరసింహారెడ్డి (ఏఐఎ్‌సటీఎఫ్‌), బసవరాజ్‌ గురికర్‌ (ఏఐపీటీఎఫ్‌), సి.ఎల్‌. రోజ్‌ (ఏఐఎ్‌ఫటీఓ) అధ్యక్షతన ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం భారీ ధర్నా నిర్వహించారు. 1 నుంచి 8 తరగతుల వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలోపు టెట్‌ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన సరికాదన్నారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, ఎన్‌ఈపీ 2020 ఉపసంహరణ, పాఠశాలల విలీనం నిలిపివేత తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నకు ఎంపీలు జాన్‌ బ్రిట్టాస్‌, సెల్వరాజ్‌, వి. శివదాసన్‌, కుమార్‌ నాయక్‌, రాజారామ్‌ సింగ్‌ హాజరై తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంటులో ఉపాధ్యాయుల గొంతుక వినిపిస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ జాతీయ నేత కె. నారాయణ, తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గోపిమూర్తి (ఏపీ), శ్రీపాల్‌ రెడ్డి (తెలంగాణ)లతో పాటు పలువురు నేతలు ఈ ధర్నానుద్దేశించి ప్రసంగించారు.

Updated Date - Feb 06 , 2026 | 04:10 AM