హైకోర్టులో ఒకలా.. సుప్రీంలో మరోలా వాదనలా?ఆ
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:05 AM
హైకోర్టులో ఒకలా, సుప్రీంకోర్టులో మరోలా ఉన్న పిటిషనర్ల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేవలం వ్యక్తిగత.....
వరకట్న వేధింపుల కేసులో నిందితుల తరఫు న్యాయవాది తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, జూన్ 9(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో ఒకలా, సుప్రీంకోర్టులో మరోలా ఉన్న పిటిషనర్ల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేవలం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు మాత్రమే కోరి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చి కేసునే కొట్టివేయాలని (క్వాష్) కోరడం ఏంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇరుపక్షాల మధ్య రాజీకి అవకాశం ఉన్నా ఆ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. నిందితుల పిటిషన్‌ను కొట్టివేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకకు చెందిన అకుల భాగ్యలక్ష్మి (ఏ2), అకుల శ్రీనివాస రెడ్డి (ఏ3)లపై వారి బంధువైన అకుల శ్రీలత అనే మహిళ ఫిర్యాదు మేరకు భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని, విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు.. కేసును కొట్టివేసే విషయంపై భద్రాచలంలోని ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని 2025 సెప్టెంబరు 9న పేర్కొంది. అయితే, పిటిషనర్లు కేసును పూర్తిగా కొట్టివేయాలంటూ ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరడం ఏమాత్రం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వర్చువల్‌గా వాదనలు వినిపించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది.. ఇరు పక్షాల మధ్య రాజీకి అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. అలాగైతే ఆ అభ్యర్థనను హైకోర్టు ముందే ఉంచాలని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.