కరుడుగట్టిన నక్సలైట్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకలేం!
ABN , Publish Date - May 25 , 2026 | 05:48 AM
కరుడుగట్టిన(హార్డ్ కోర్) నక్సలైట్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకలేం కదా? అడవుల్లో జరిగే ఆపరేషన్లు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సాగుతాయి.
కట్టా రామచంద్రారెడ్డి మృతదేహానికి రీపోస్టుమార్టం జరపాలన్న పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘‘కరుడుగట్టిన(హార్డ్ కోర్) నక్సలైట్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకలేం కదా? అడవుల్లో జరిగే ఆపరేషన్లు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సాగుతాయి. పిటిషనర్ తండ్రి కట్టా రామచంద్రారెడ్డి ఒక హార్డ్‌కోర్ నక్సలైట్. ఆపరేషన్ సమయంలో ఆయన వద్ద నుంచి అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ అన్నారు. యాంటీ-నక్సల్ ఆపరేషన్లలో పాల్గొనే భద్రతా బలగాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తాయని గుర్తుచేశారు. ఒకవేళ మరణించిన వ్యక్తి ఎటువంటి నేర చరిత్ర లేని సాధారణ వ్యక్తి అయి ఉంటే కోర్టు పరిస్థితిని అర్థం చేసుకునేదని, కానీ సాయుధ నక్సలైట్‌ను పుష్పగుచ్ఛాలతో స్వాగతించలేమని ఘాటుగా వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సిద్దిపేట జిల్లాకు చెందిన కట్టా రామచంద్రారెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు, రీ-పోస్ట్‌మార్టం జరపాలంటూ దాఖలైన పిటిషన్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించేందుకు నిరాకరిస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. గత ఏడాది సెప్టెంబరు 22న ఛత్తీస్‌గఢ్ పోలీసులు జరిపిన యాంటీ-మావోయిస్ట్ ఆపరేషన్‌లో కట్టా రామచంద్రారెడ్డితోపాటు కడారి సత్యనారాయణరెడ్డి మరణించారు. అయితే, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ రామచంద్రారెడ్డి కుమారుడు రాజాచంద్ర ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. దసరా సెలవుల కారణంగా హైకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించడంతో ఆయన అక్టోబరు 24న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ తేలేవరకు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచాలని ఆదేశించింది. ఇటీవల ఈ పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
కస్టడీ మరణం అని ఎలా చెప్తారు?
రామచంద్రారెడ్డి శరీర భాగాలపై అనేక గాయాలు ఉన్నాయని, ఇది కస్టడీలో పెట్టి హింసించడం వల్ల జరిగిన మరణమేనని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వెస్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనను ధర్మాసనం పూర్తిగా తోసిపుచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా స్పందిస్తూ.. ‘‘ఎన్‌కౌంటర్ అంటే కేవలం తుపాకీ కాల్పులతోనే ముగుస్తుందా? అక్కడ ఉభయ పక్షాల మధ్య పెనుగులాట జరిగి ఉండవచ్చు కదా? ఆ పెనుగులాటలో శరీరానికి గాయాలైతే, దాన్ని కస్టడీ మరణంగా ఎలా భావిస్తారు?’’ అని ప్రశ్నించారు. హింసించారని చెప్పడానికి గాయాలు ఇంకా చాలా ఉన్నాయని గోన్సాల్వెస్ వాదించారు. అయితే, ఆ గాయాలు రైఫిల్ బోల్ట్ తగలడం వల్ల కూడా అయ్యే అవకాశం ఉంది కదా? అని జస్టిస్ దత్తా అభిప్రాయపడ్డారు. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.