Share News

తెలంగాణలో నిబంధనలు వేరు!

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:29 AM

తెలంగాణలోలాగానే ఝార్ఖండ్‌లోనూ న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెం చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణలో నిబంధనలు వేరు!

  • ఝార్ఖండ్‌లో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు కుదరదు

  • స్పష్టం చేసిన సుప్రీం.. న్యాయాధికారి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోలాగానే ఝార్ఖండ్‌లోనూ న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెం చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచారని, అందుకే అక్కడ న్యాయాధికారుల వయసు పెంపు సమంజసమని అభిప్రాయపడింది. ఝార్ఖండ్‌కు చెందిన రంజిత్‌ కుమార్‌ అనే న్యాయాధికారి పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను మంగళవారం ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61, 62 ఏళ్లకు పెంచారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ జ్యుడీషియల్‌ వేతన సంఘం సిఫారసుల మేరకు ఝార్ఖండ్‌లోనూ వయసు పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచారని, అందుకే జడ్జిల పదవీ విరమణను సైతం 61, 62 ఏళ్లకు పొడిగించారని చెప్పారు. కానీ, ఝార్ఖండ్‌లో ప్రభుత్వ అధికారుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లేనని, అలాంటప్పుడు న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అనేది పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయమని ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Jan 28 , 2026 | 03:29 AM