న్యాయమూర్తికి పక్షపాతం ఆపాదించొద్దు..
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:33 AM
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) వివాదంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీం
ఓఆర్ఆర్ వివాదాన్ని మధ్యవర్తిత్వంతోనే పరిష్కరించుకోవాలని హెచ్ఎండీఏకు సూచన
న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) వివాదంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ నుంచి ఒక న్యాయమూర్తి తప్పుకొనేలా (రెక్యూజల్) ఆదేశాలివ్వాలని హెచ్ఎండీఏ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఆ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించింది. ఒక న్యాయమూర్తి గతంలో అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఉంటూ కేంద్రం తరఫున లాంఛనప్రాయమైన విచారణకు హాజరైనంత మాత్రాన.. ఇప్పుడు ఆయన విచారించే కేసుల్లో ఏకపక్షంగా ఆలోచిస్తారనడం ఏమాత్రం సహేతుకంగా లేదని స్పష్టం చేసింది. కాగా, ఈ వివాదంలో ఆర్బిట్రేటర్ నియామకం, ఫీజు చెల్లింపు తదితర ప్రక్రియలను ఐసీఏ నిబంధనల ప్రకారం పూర్తి చేసేందుకు ఉన్న సమయం ముగిసిపోవడంతో, ఆ గడువును పెంచాలని
హెచ్ఎండీఏ తరఫు న్యాయవాదులు కోరగా, ధర్మాసనం 4 వారాల గడువు ఇచ్చింది. 2007 ఆగస్టు 17న హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) సంయుక్తంగా... హైదరాబాద్ ఎక్స్‌ప్రె్‌సవే లిమిటెడ్ (హెచ్ఈఎల్) సంస్థతో బీవోటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన ఓఆర్ఆర్ నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. భవిష్యత్తులో ఇరుపక్షాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తినా ఐసీఏ నిబంధనల ప్రకారం మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నాయి. ఆ తర్వాత కాలంలో కన్సార్టియం భాగస్వామి దివాలా తీయడం, షేర్ హోల్డింగ్‌లో అనధికారిక మార్పులు జరిగాయని పేర్కొంటూ... గతంలో కుదుర్చుకున్న ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇకపై చెల్లదని హెచ్ఎండీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఐసీఏ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తూ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హెచ్ఎండీఏ, హెచ్జీసీఎల్లు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ రిట్ పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. హెచ్ఎండీఏ వాదనలను తోసిపుచ్చింది. ఒప్పందంలో మఽధ్యవర్తిత్వ నిబంధన ఉన్నప్పుడు, దానికి సంబంధించి చట్టపరమైన అభ్యంతరాలనైనా ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్టు 1996 ప్రకారమే ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ముందే లేవనెత్తాలని తేల్చిచెప్పింది. తాజాగాహైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.