Share News

‘బొమ్మరిల్లు’ కేసుల బదిలీకి సుప్రీం ‘నో’

ABN , Publish Date - May 13 , 2026 | 04:02 AM

ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘బొమ్మరిల్లు ఫార్మ్స్‌ అండ్‌ విల్లాస్‌’ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, సంస్థ డైరెక్టర్‌ వనపల్లి వెంకటరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

‘బొమ్మరిల్లు’ కేసుల బదిలీకి సుప్రీం ‘నో’

  • ఒకే కోర్టులో విచారణ సాధ్యం కాదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘బొమ్మరిల్లు ఫార్మ్స్‌ అండ్‌ విల్లాస్‌’ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, సంస్థ డైరెక్టర్‌ వనపల్లి వెంకటరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కుంభకోణానికి సంబంధించి వేర్వేరు జిల్లాల్లో నమోదైన కేసులన్నింటినీ ఒకే కోర్టుకు బదిలీ చేసి, ఉమ్మడిగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు వివిధ జిల్లాల్లో ఉన్నాయని, విచారణ సమయంలో ఇబ్బంది తలెత్తుతోందని, కావున అన్ని పిటిషన్లను ఒకే కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. హైకోర్టు తీర్పును వనపల్లి వెంకటరావుతోపాటు మరో ఐదుగురు గత నెల 23న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను ఒకే కోర్టులో కలిపి విచారించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెబుతూ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Updated Date - May 13 , 2026 | 04:02 AM