ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి
ABN , Publish Date - May 30 , 2026 | 03:50 AM
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)’ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. సర్వీసులో కొనసాగడానికి..
మరోసారి తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, మే 29: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)’ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. సర్వీసులో కొనసాగడానికి.. ఈ పరీక్షలో ఉత్తీర్ణత గడువును 2027 ఆగస్టు 31 నుంచి 2028 ఆగస్టు 31కి పొడిగించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. అంజుమన్ ఇషాత్ ఏ తాలీమ్ ట్రస్ట్ కేసులో కోర్టు ఇచ్చిన 2025 నాటి తీర్పును సవాల్ చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తిగతంగా కొందరు టీచర్లు దాఖలు చేసిన 65కు పైగా రివ్యూ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి అర్హులైన ఉపాధ్యాయులు అవసరమని తేల్చిచెప్పింది. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులై.. పదవీ విరమణకు ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా 2025 సెప్టెంబరు 1 నుంచి రెండేళ్లలోగా టెట్ పరీక్ష పాస్ కావాలని 2025లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఐదేళ్లలోపు రిటైరయ్యే ఉపాధ్యాయులకు ఈ పరీక్ష పాస్ కావడం నుంచి మినహాయింపునిచ్చినప్పటికీ..ఆలోగా వారికి ఎలాంటి ప్రమోషన్లూ ఉండవని సుప్రీం స్పష్టం చేసింది. అయితే, విద్యాహక్కు చట్టం అమలుకు ముందు నియమితులైనవారికి దీన్నుంచి మినహాయింపునివ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. వారు కూడా టెట్ పాసవ్వాలని నిర్దేశించడమంటే.. చట్టాన్ని పాత తేదీ నుంచీ వర్తింపజేయడమేనని వాదించారు. వారి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇన్‌సర్వీ్‌స టీచర్లు కూడా నిర్ణీత కాలపరిమితిలోగా కనీస అర్హతలను సాధించాలని విద్యాహక్కు చట్టం నిబంధనలు నిర్దేశిస్తున్నాయని.. వారు ఆ అర్హతలను సాధించడానికి సమయం కూడా ఇచ్చిందని గుర్తుచేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన సబార్డినేట్ లెజిస్లేషన్ లేదా నోటిఫికేషన్లలోని మినహాయింపులు మూలచట్టాన్ని అధిగమించలేవని చెప్పింది. టెట్ అనేది.. ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను, బాలలకు బోధించడంపై వారికి ఉన్న అవగాహనను, ఉపాధ్యాయులుగా వారికి ఉండాల్సిన అభిరుచి/సామర్థ్యం ఉన్నాయో లేవో అంచనా వేసే అర్హత పరీక్ష అని గుర్తుచేసింది. టెట్‌ను తప్పనిసరి చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే వాదన ఆధారంగా గత తీర్పును అమలు కాకుండా చేస్తే.. అర్హతలేని ఉపాధ్యాయులను సర్వీసులో కొనసాగించడమే అవుతుందని.. ఇది రాబోయే తరాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వెలిబుచ్చింది. పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి ఉపాధ్యాయుల సర్వీసును కొనసాగించలేమని చెప్పింది. సర్వీసులో ఉపాధ్యాయులంతా ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణులవ్వాల్సిందేనని తేల్చిచెబుతూ.. టెట్ ఉత్తీర్ణత గడువును మాత్రం తాజాగా మరో ఏడాదిపాటు పొడిగించింది. ఇకపై కాలపరిమితిని పొడిగించబోమని స్పష్టం చేసింది. టెట్‌ను 6నెలలకొకసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.