అంత అత్యవసర విచారణ ఎందుకు?
ABN , Publish Date - May 30 , 2026 | 03:49 AM
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల కు సంబంధించి దాఖలైన పలు ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ల(ఐఏ)పై అత్యవసర జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 29(ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల కు సంబంధించి దాఖలైన పలు ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ల(ఐఏ)పై అత్యవసర జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో అంత అత్యవసరం ఏముందని ప్రశ్నించింది. ఈ అంశంపై సమాధానం చెప్పాలని గవర్నర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని 2024లో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకాన్ని గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తమ వాదనలు వినాలంటూ అమీర్ అలీఖాన్ తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ ఎం నూలీ ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేశారు. మరికొందరు కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వీటిపై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాదులు కోరగా జస్టిస్ విక్రమ్ నాథ్ నిరాకరించారు. అత్యవసరంగా విచారణ చేపట్టడానికి ఏముందని ప్రశ్నించారు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం జరిగిన దానికి గవర్నర్ ఏమి చేస్తారని అన్నారు. గవర్నర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జూలై 22న తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది.