హైకోర్టులోనే తేల్చుకోండి
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:05 AM
తెలంగాణలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల పంచాయితీపై సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది.
ప్రభుత్వ సిఫార్సులపై స్పందించకుంటే కోర్టుకెళ్లండి
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు
పిటిషన్ల గందరగోళంపై ధర్మాసనం అసంతృప్తి
తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల పంచాయితీపై సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. మంత్రిమండలి సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెడితే, దానిపై హైకోర్టును ఆశ్రయించడమే సరైన మార్గమని స్పష్టం చేసింది. ఈ విషయంలో హైకోర్టు అనే పరిష్కారం అందుబాటులో ఉందని సూచించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని 2024 ఆగస్టు 4న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని వారు సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదనలతో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ నియామకాన్ని గతేడాది ఆగష్టు 13న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగిస్తోంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ ఎం నూలీ ఇంప్లీడ్ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. అలీఖాన్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్సీగా అమీర్ ఖాన్ ప్రమాణం చేశారని, ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం కోదండరాం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసులను గవర్నర్ ఆమోదించారని, కోదండరాం ఎమ్మెల్సీగా నియమితులయ్యారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ఎమ్మెల్సీ నియామకం రద్దు అయ్యిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి కోదండరాం పేరును గవర్నర్‌కు సిఫారసు చేసిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ హైకోర్టుకు వెళ్లొచ్చు కదాని ప్రశ్నించారు. మరోసారి అలీఖాన్ తరఫు న్యాయవాది కలుగజేసుకుని తమకు హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
ధర్మాసనం అసహనం
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించిన అన్ని పిటిషన్లను కలపడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన అంశమే, అయినప్పటికీ ఒక్కొక్కరిదీ ఒక్కో వివాదం కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని కలపడంతో గందరగోళ పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఆ రోజు ఈ కేసును ప్రియారిటీగా భావించి తుది విచారణ చేపడతామని ధర్మసనం స్పష్టం చేసింది.