Share News

చిన్న ఉద్యోగికి ఎందుకంత పెద్ద శిక్ష?

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:48 AM

సమగ్ర దర్యాప్తు, సరైన విచారణ లేకుండానే కోర్టు అటెండర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

చిన్న ఉద్యోగికి ఎందుకంత పెద్ద శిక్ష?

  • ఆధారాలు లేకుండానే ఉద్యోగం నుంచి తొలగిస్తారా?

  • కరీంనగర్‌ కోర్టు అటెండర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • ఉద్యోగంలోకి తీసుకుని మూడు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశం.. హైకోర్టు తీర్పు కొట్టివేత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సమగ్ర దర్యాప్తు, సరైన విచారణ లేకుండానే కోర్టు అటెండర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘అనారోగ్యంతో 5 రోజులు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా? చిన్న ఉద్యోగికి అన్యాయంగా ఎందుకంత పెద్ద శిక్ష’.. అని వ్యాఖ్యానించింది. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, మూడు వారాల్లో బకాయిలన్నీ అందజేయాలని తీర్పు ఇచ్చింది. కరీంనగర్‌ అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌(అటెండర్‌)గా పనిచేస్తున్న కె.రాజయ్య 2017లో ఆగస్టు 3 నుంచి 7వ తేదీ వరకూ కడుపునొప్పి, జ్వరం కారణంగా విధులకు హాజరు కాలేదు. అనధికారికంగా విధులకు గైర్హాజరు అయ్యారంటూ ఆయనకు పై అధికారి మెమో జారీ చేయగా, తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నానంటూ రాజయ్య.. ఒక ప్రైవేటు డాక్టర్‌ పేరిట మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించారు. ఆ సర్టిఫికెట్‌ సరైనదేనా తెలియజేయాలంటూ సదరు డాక్టరు బొమ్మరవేణి స్వామికి నోటీసులు జారీ చేయగా.. ఆయన అది తాను ఇచ్చినది కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో, రాజయ్య ఫోర్జరీ సర్టిఫికేట్‌ సమర్పించారని నిర్ధారించి, 2018లో ఆయనను సర్వీసు నుంచి తొలగించారు. దీనిపై రాజయ్య హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆయన తొలగింపును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో 2024లో రాజయ్య సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నుంచి ఫైళ్లను తెప్పించుకున్న ధర్మాసనం.. రాజయ్య సమర్పించిన మెడికల్‌ సర్టిఫికెట్‌లోని హ్యాండ్‌ రైటింగ్‌ను, సంతకాన్ని పరిశీలించింది. తమ ఎదుట హాజరు కావాలంటూ కోర్టు అధికారి పంపించిన నోటీసు మీద డాక్టర్‌ స్వామి చేసిన సంతకం, రబ్బరుస్టాంపుతో దీనిని సరిపోల్చింది. అనంతరం తీర్పు వెలువరిస్తూ.. ‘రాజయ్య సమర్పించిన మెడికల్‌ సర్టిఫికెట్‌లోని రబ్బర్‌ స్టాంప్‌, డాక్టర్‌ నోటీసు కాపీ వెనుక ఉన్న రబ్బర్‌ స్టాంప్‌ ఒకే విధంగా ఉన్నాయి. రెండింటిపై డాక్టర్‌ సంతకాలు వందశాతం ఒకేలా లేనప్పటికీ, స్థూలంగా ఒకేలా ఉన్నాయి. ఇలాంటి అస్పష్టమైన పరిస్థితుల్లో.. ఫోర్జరీ జరిగిందని నిర్ధారించే ముందు దర్యాప్తు అధికారి ఆ విషయాన్ని హ్యాండ్‌ రైటింగ్‌ నిపుణుడికి పంపడం విజ్ఞత అనిపించుకుంటుంది. అలా చేయకపోవటం వల్ల ఫోర్జరీ ఆరోపణ రుజువు కాలేదని మేము భావిస్తున్నాము’ అని ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును, అధికారుల డిస్మిస్‌ ఆర్డర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజయ్యను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది.

Updated Date - Feb 12 , 2026 | 12:48 AM