Share News

తెలంగాణకు 4 వారాల్లో రెగ్యులర్‌ డీజీపీ

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:17 AM

తెలంగాణలో రెగ్యులర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తిచేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

తెలంగాణకు 4 వారాల్లో రెగ్యులర్‌ డీజీపీ

  • నియామక ప్రక్రియ వేగంగా పూర్తిచేయండి

  • యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం

  • రాష్ట్రాల్లో యాక్టింగ్‌ డీజీపీల నియామకం పరిపాటి అయ్యింది

  • రాష్ట్రాలు జాప్యం చేస్తే మా వద్దకు రండి

  • యూపీఎస్సీకి సుప్రీం స్పష్టమైన ఆదేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెగ్యులర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తిచేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రెగ్యులర్‌ డీజీపీల నియామకం ఇష్టం ఉండదని, ప్రభుత్వాల ట్రాప్‌లో యూపీఎస్సీ పడొద్దని సూచించింది. పలు రాష్ట్రాల్లో యాక్టింగ్‌ డీజీపీలను నియమించడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో అన్ని అర్హతలున్న సీనియర్‌ అధికారులకు నష్టం జరుగుతోందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌ 26న డీజీపీ జితేందర్‌ పదవీ విరమణ చేయడంతో, 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి శివధర్‌ రెడ్డికి ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నియామకం ‘ప్రకాశ్‌ సింగ్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమని సామాజిక కార్యకర్త టి.ధనగోపాల్‌రావు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. శివధర్‌రెడ్డి నియామకాన్ని నిలిపివేసి, నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ డీజీపీని నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో నాలుగు వారాల్లో రెగ్యులర్‌ డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించగా, ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఈ ఏడాది జనవరి 29న యూపీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. యూపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది నరేశ్‌ కౌశిక్‌, తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదించారు.


కోర్టు ధిక్కార కేసు పెట్టలేదేం?: సీజేఐ

తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్‌ డీజీపీ నియామకానికి ప్రతిపాదనలు పంపలేదని, యాక్టింగ్‌ డీజీపీని నియమించుకుందని యూపీఎస్సీ తరఫు నరేశ్‌ కౌషిక్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘ప్రకాశ్‌ సింగ్‌ కేసులో 2006లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. రాష్ట్రాలు డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందుగానే కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్సీకి ప్రతిపాదనలు పంపాలి. ఆ పేర్లను పరిశీలించిన యూపీఎస్సీ ప్యానల్‌ కొత్త డీజీపీకి సంబంధించి రాష్ట్రానికి సిఫారసు చేస్తుంది. కానీ, రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపడంలో జాప్యం చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే యాక్టింగ్‌ డీజీపీలను నియమించుకుంటున్నాయి. తెలంగాణ సైతం నూతన డీజీపీ నియామకం కోసం చేసే ప్రతిపాదనలను నిర్దేశించిన మూడు నెలల ముందు పంపలేదు’ అని తెలిపారు. దీంతో అలాంటప్పుడు మీరు (యూపీఎస్సీ) తెలంగాణ ప్రభుత్వంపై ఎందుకు ధిక్కార కేసు దాఖలు చేయలేదని సీజేఐ ప్రశ్నించారు. పోలీసు సంస్కరణల కోసం సుప్రీంకోర్టు గతంలో ప్రకాశ్‌ సింగ్‌ కేసులో ఇచ్చిన స్పష్టమైన తీర్పును, మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వాలు ఎందుకు పాటించటంలేదని నిలదీశారు. హైకోర్టు తీర్పుపై తాము స్టే విధిస్తే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంలో తెలంగాణ నిర్లక్ష్యంతోపాటు యూపీఎస్సీ బాధ్యతను విస్మరించినట్లు కనిపిస్తోందని చురకలంటించారు. ‘తెలంగాణలోరెగ్యులర్‌ డీజీపీ ఎలాగూ లేరు. కనీసం యాక్టింగ్‌ డీజీపీ కూడా లేకపోతే పరిస్థితి ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల గడువు పాటించనప్పుడే మీరు కోర్టు ధిక్కార పిటిషన్‌ వేస్తే బాగుండేది. అప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు సాకులు చెబుతామంటే ఎలా?’అని యూపీఎస్సీ తీరును సీజేఐ ప్రశ్నించారు. రెగ్యులర్‌ డీజీపీలను నియమించటం రాష్ట్రాలకు ఇష్టముండదని, యాక్టింగ్‌ డీజీపీలంటేనే ఇష్టమని సీజేఐ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల ట్రాప్‌లో పడొద్దని యూపీఎస్సీకి సూచించారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోయినా, ప్రతిపాదనలు పంపడంలో జాప్యం చేసినా వెంటనే సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార అప్లికేషన్‌ దాఖలు చేయాలని సూచించారు. సకాలంలో స్పందించని రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యులపై (ప్రధాన కార్యదర్శులు/హోం కార్యదర్శులు) చర్యలు తప్పవని సీజేఐ హెచ్చరించారు. ఇకనైనా ఎంపానల్‌మెంట్‌ కమిటీ మీటింగ్‌ (ఈసీఎం) వీలైనంత త్వరగా నిర్వహించి తెలంగాణలో రెగ్యులర్‌ డీజీపీ నియామకానికి సిఫారసు చేయాలని యూపీఎస్సీని ఆదేశించారు.

Updated Date - Feb 06 , 2026 | 04:17 AM