నక్సలైట్లపై పోరాడినా ప్రమోషన్ ఇవ్వరా?
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:04 AM
ప్రాణాలకు తెగించి నక్సలైట్ల దాడిని తిప్పికొట్టిన ఒక కానిస్టేబుల్‌కు పదోన్నతి ఇవ్వకుండా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకు తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కీలక పాత్ర ఆయనదేనని చెప్పి విస్మరిస్తారా
తెలంగాణ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలకు తెగించి నక్సలైట్ల దాడిని తిప్పికొట్టిన ఒక కానిస్టేబుల్‌కు పదోన్నతి ఇవ్వకుండా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకు తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనతోపాటు విధుల్లో ఉన్న ఇతర సిబ్బందికి పదోన్నతి కల్పించి, అతనికి మాత్రం నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నక్సలైట్లపై పోరాడినా హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ ఇవ్వరా? అని ప్రశ్నించింది. పి. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్‌కు సత్వరమే పదోన్నతి కల్పించాలని తేల్చిచెప్పింది. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గత డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వీ. అంజారియాలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఎక్కువ రౌండ్లు కాల్పులు జరిపారని, నక్సలైట్ల దాడిని తిప్పికొట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రభుత్వమే అంగీకరిస్తోందని గుర్తు చేసింది. అలాంటప్పుడు అతని పాత్రను తక్కువ చేసి చూపి ప్రమోషన్ నిరాకరించడం అన్యాయమని పేర్కొంది. సామూహికంగా పోరాడినప్పుడు ఒకరికి పదోన్నతి కల్పించి.. మరొకరికి నిరాకరించడం వివక్షే అవుతుందని పేర్కొంది. ఈ పోరాటంలో పాల్గొన్న వెంకట్ రెడ్డి అనే కానిస్టేబుల్‌కు పదోన్నతి కల్పించిన తేదీ నుంచే శీనివా్‌సకు కూడా హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించాలని ఆదేశించింది. 1999 జనవరి 30న బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌పై ముగ్గురు నక్సలైట్లు దాడి చేశారు. అప్పుడు విధుల్లో ఉన్న పి. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ తన సహచరులతో కలిసి ఆ దాడిని ప్రతిఘటించారు. ఆ ఘటనలో పాల్గొన్న ఇతర పోలీసులకు ప్రభుత్వం సత్వర పదోన్నతి కల్పించింది. శ్రీనివా్‌సకు మాత్రం ప్రమోషన్ ఇవ్వలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.