పోక్సో నిందితుడికీ న్యాయ సహాయం!
ABN , Publish Date - May 22 , 2026 | 04:39 AM
చిన్నారిపై హత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోక్సో కేసు నిందితుడికి చట్టపరమైన న్యాయ సహాయం అందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
తెలుగు తెలిసిన న్యాయవాదిని కేటాయించండి
చిన్నారిపై హత్యాచార ఘటన.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మరో హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న నిందితుడు
న్యూఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): చిన్నారిపై హత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోక్సో కేసు నిందితుడికి చట్టపరమైన న్యాయ సహాయం అందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తెలుగు వ్యక్తి అయిన నిందితుడు మరో హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే, నిందితుడి తరఫున వాదనలు వినిపించేందుకు అతడి మాతృభాష అయిన ‘తెలుగు’ తెలిసిన న్యాయవాదిని లీగల్ ఎయిడ్ ద్వారా కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2016లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్యాచార కేసులో చింతకింది అనిల్ అనే వ్యక్తిని దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును అనిల్ హైకోర్టులో సవాలు చేయగా.. పోలీసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. అనిల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రతివాది అనిల్ జంట హత్యల కేసులో జైలులో ఉన్నాడని, అందుబాటులో ఉన్న చివరి చిరునామాకు నోటీసులు పంపామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ప్రతివాదికి భాషా పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు హాలులో ఉన్న న్యాయవాదుల్లో ఎవరికైనా తెలుగు అర్థం అవుతుందా? అని వాకబు చేసింది. తెలుగు అర్థమయ్యే వారెవరూ ఆ సమయంలో కోర్టు హాలులో లేరు. దీంతో కోర్టు విచారణకు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరైతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రతివాదికి తెలియజేయకుండా తదుపరి చర్యలకు ఉపక్రమించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగే లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన న్యాయవాదిని ఆయన తరపున ఏర్పాటు చేయమని ధర్మాసనం ఆదేశించింది.