Share News

నాలుగు వారాల్లో 15 కోట్లు డిపాజిట్‌ చేయండి

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:49 AM

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్‌)కు నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని

నాలుగు వారాల్లో 15 కోట్లు డిపాజిట్‌ చేయండి

  • గీతం యాజమాన్యానికి సుప్రీంకోర్టు ఆదేశం

  • గీతం, టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ వివాదంలో నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎ్‌సఎస్పీడీసీఎల్‌)కు నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉభయ పక్షాల హక్కులకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించింది. గీతం.. విద్యాసంస్థ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే మధ్యంతర వెసులుబాటు కల్పిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. వీబీసీ ఫెర్రో అలాయ్స్‌ సంస్థ చెల్లించాల్సిన రూ.118 కోట్ల బకాయిలను ఆ సంస్థతో సంబంధం ఉన్న గీతం చెల్లించాలంటూ టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. దీనిపై గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యే మార్గంగా ఈ వివాదం ముగిసే వరకూ రూ.54 కోట్లు చెల్లించాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గీతం యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ తీర్పును ఈ నెల 5న గీతం యాజమాన్యం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘మా వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే నోటీసు జారీ చేసింది’’ అని గీతం యాజమాన్యం ధర్మాసనం ముందుకు తీసుకెళ్లింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. గీతంను రూ.15 కోట్లు విద్యుత్‌ సంస్థ వద్ద నాలుగువారాల్లో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రధాన రిట్‌ పిటిషన్‌ను త్వరితగతిన విచారించి, పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌తో సహా ఇతర అనుబంధ పిటిషన్లపై విచారణను ముగించింది.

Updated Date - Feb 17 , 2026 | 06:51 AM