రామోజీరావు లేకపోయినా.. ఆస్తులు జప్తు చేయొచ్చు
ABN , Publish Date - May 05 , 2026 | 03:55 AM
రామోజీరావు లేకపోయినప్పటికీ, ఆస్తులు జప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తి మరణించినా, సంబంధిత సంస్థ ఉనికిలో ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగియవని తేల్చిచెప్పింది.
వ్యక్తి మరణంతో సంస్థపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగియవు
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మార్గదర్శి, కిరణ్‌తోపాటు ఏపీ, తెలంగాణ, ఆర్బీఐలకు నోటీసులు
న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): రామోజీరావు లేకపోయినప్పటికీ, ఆస్తులు జప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తి మరణించినా, సంబంధిత సంస్థ ఉనికిలో ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగియవని తేల్చిచెప్పింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ేసకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామోజీరావు మరణించినందున తదుపరి విచారణ అవసరం లేదన్న యాజమాన్య వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మార్గదర్శిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును 19 డిసెంబరు 2025న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం విచారించింది. మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన నిందితుడు చనిపోయినందున ఈ కేసును మూసివేయాలని కోరారు. అయితే, ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించలేదు. ‘‘ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన, కొనసాగుతున్న ఆర్థిక సంస్థపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రజాధనానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన. అవసరమైతే ఆస్తులను అటాచ్ చేసి, ఆ మొత్తాన్ని బాధితులకు పంచవచ్చు తెలుసా?’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె. పరమేశ్వరన్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు ప్రారంభదశలో ఉండగానే హైకోర్టు కేసును కొట్టివేయడం సరికాదన్నారు. ఎఫ్‌ఐఆర్ అనేది నేరాలకు సంబంధించిన పూర్తి ‘ఎన్‌సైక్లోపీడియా’ కాదని, విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. గతంలో ఆర్బీఐ వ్యక్తం చేసిన అభ్యంతరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాగా, డిపాజిటర్లు అందరికీ చెల్లింపులు పూర్తి చేశామని ముకుల్ రోహిత్గీ తెలిపారు. అలాగైతే.. ఆ వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ఈ వివాదంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్, చెరుకూరి కిరణ్‌లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 15కు వాయిదా వేసింది.