Share News

బాల నేరస్తులను సంస్కరించాలి

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:41 AM

నేరాలు చేసిన బాలలను సంస్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న సూచించారు.

బాల నేరస్తులను సంస్కరించాలి

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న

శామీర్‌పేట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): నేరాలు చేసిన బాలలను సంస్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న సూచించారు. వారి పునరావాసానికి కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తీవ్రమైన నేరాలు చేసిన పిల్లలను కూడా పెద్దలుగా పరిగణించి శిక్షించాలన్న జువెనైల్‌ జస్టిస్‌ చట్టం-2015లో తలెత్తుతున్న చిక్కుల విషయమై శామీర్‌పేటలోని నల్సార్‌లో జరిగిన జాతీయ సదస్సులో శనివారం ఆమె ప్రసంగించారు. సుప్రీంకోర్టు జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆమె నేరస్తుల సంస్కరణను నొక్కి చెప్పారు. ఈ విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ చట్టంలోని లోటుపాట్లను వివరించారు. 2000నాటి చట్టంలో పునరావాసానికి ప్రాధాన్యం ఉందని చెప్పారు. నల్సార్‌ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు మాట్లాడుతూ పిల్లల విషయంలో చాలా సున్నితంగా వ్యవహించాలని, విచారణ ప్రక్రియలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల సంరక్షణకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Updated Date - Jan 25 , 2026 | 03:41 AM