Share News

ఏఎంవీఐ పోస్టుల భర్తీ ప్రక్రియపై పిటిషన్‌..

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:24 AM

తెలంగాణ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీ వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. అభ్యర్థుల ఛాతీ కొలతల ...

ఏఎంవీఐ పోస్టుల భర్తీ ప్రక్రియపై పిటిషన్‌..

  • టీజీపీఎస్సీ, సీఎస్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీ వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. అభ్యర్థుల ఛాతీ కొలతల నిర్థారణలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. టీజీపీఎస్సీతో సహా ఐదుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాత పరీక్షల్లో మెరిట్‌ సాధించిన వారికి జూలై 2024లో హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి (ఓజీహెచ్‌) మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య పరీక్షల ప్రక్రియ అశాస్ర్తీయంగా జరిగిందని, తగిన నైపుణ్యం లేని సిబ్బందితో కొలతలు తీయించారని, మెరిట్‌ అభ్యర్థులను సైతం అనర్హులుగా ప్రకటించారనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మిట్టపల్లి శ్రీనివాస్‌ సైతం తనకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ సోమవారం ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీజీపీఎస్సీ నిబంధనల మేరకు వైద్య పరీక్షలు జరగలేదని, అందువల్ల అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. టీజీపీఎస్సీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ కమిషనర్‌, ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది.

Updated Date - Jun 09 , 2026 | 05:24 AM