ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:45 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి ఊరట
కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్ద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పీఎ్‌సలో ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. ఇందులో అప్పట్లో ఎస్‌ఐబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేశారు. ఇంతలోనే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఆయన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. అయితే, ముందస్తు బెయిల్ ఇస్తేనే తిరిగి వస్తానని ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును గత ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు డిసెంబరు 11న ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆ పిటిషన్ మరోసారి మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఇరు వర్గాల వాదనల తర్వాత ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలు పాటిస్తున్నాం..
సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభాకర్ రావు పాటిస్తున్నారని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, దామా శేషాద్రినాయుడు తమ వాదనలు వినిపించారు. కస్టోడియల్ విచారణ సైతం ముగిసిందని తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణకు పూర్తిస్థాయిలో ప్రభాకర్ రావు కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపిస్తూ.. విచారణకు ఈ కేసు అర్హమా కాదా అనే అంశంపై నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడు తేల్చకుండా పెండింగ్‌లో ఉంచాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర రక్షణనే కొనసాగించాలని, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయవద్దని విన్నవించారు. అయితే, ధర్మాసనం పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుని ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేసింది.
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దే
సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని ప్రభాకర్ రావును ధర్మాసనం ఆదేశించింది. తదుపరి దర్యాప్తునకు, ట్రయల్ కోర్టులో జరిగే విచారణ ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని నిర్దేశించింది. ట్రయల్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. కోర్టు నిబంధనల్లో ఏ ఒక్క దానిని ఉల్లంఘించినా బెయిల్ తక్షణమే రద్దవుతుందని హెచ్చరించింది.