Share News

కొత్త గవర్నర్‌కు కొంత సమయం ఇవ్వండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:33 AM

తెలంగాణకు కొత్త గవర్నర్‌ వచ్చారని, ఎమ్మెల్సీల నియామక దస్ర్తాలను పరిశీలించాల్సి ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు భారత అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌.వెంకటరమణి విజ్ఞప్తి చేశారు...

కొత్త గవర్నర్‌కు కొంత సమయం ఇవ్వండి

  • ఎమ్మెల్సీల నియామక దస్త్రాలను పరిశీలించాల్సి ఉంది

  • సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్‌ విజ్ఞప్తి

  • సామరస్యంతో పరిష్కరించుకుంటే మంచిదే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణకు కొత్త గవర్నర్‌ వచ్చారని, ఎమ్మెల్సీల నియామక దస్ర్తాలను పరిశీలించాల్సి ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టుకు భారత అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌.వెంకటరమణి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల్లో గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలను నామినేట్‌ చేసే ప్రక్రియలో కోర్టుల జోక్యం కంటే ఉభయ పక్షాల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేలా గవర్నర్‌కు తగిన సలహా ఇస్తానని న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. 2025 ఆగస్టు నాటి మధ్యంతర ఉత్తర్వుల సవరణ, రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ నియామకం నేపథ్యంలో మరికొంత సమయం ఇస్తే సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం దొరుకుతుందని ఆకాంక్షించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమకు అవకాశం కల్పించినప్పటికీ... అప్పటి గవర్నర్‌ తిరస్కరించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై బుధవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. గవర్నర్‌ కార్యాలయం తరఫున అటార్నీ జనరల్‌ వెంకటరమణి వాదనలు వినిపించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపిన(కోదండరాం, అజారుద్దీన్‌ పేర్లతో కూడిన) సిఫార్సులకు సంబంధించి గవర్నర్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కొన్ని విషయాల్లో కోర్టులు కఠిన నిబంధనలు విధిస్తే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ తీసుకునే నిర్ణయాన్ని బట్టి కేసు విచారణను ముగించాలా? కొనసాగించాలా? అనేది నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. ఏజీ వాదనలపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ సానుకూలంగా స్పందించారు. గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగ సంస్థలు సామరస్యంగా పరిష్కరించుకుంటామంటే, అంతకంటే కావాల్సిందేముంది? అని నవ్వుతూ స్పందించారు. ఈ క్రమంలో కోర్టు హాలంతా చిరునవ్వులు చిందించింది. ఈ క్రమంలో పిటిషనర్‌ కుర్రా సత్యనారాయణ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్పటి గవర్నర్‌ విచిత్రమైన కారణాలతో తన క్లయింట్‌ పేరును పక్కనపెట్టారని పేర్కొన్నారు. కనీసం కొత్తగా చేపట్టే ప్రక్రియలోనైనా తన క్లయింట్‌ పేరును పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నామినేటెడ్‌ పదవిని డిమాండ్‌ చేయడం చట్టపరమైన హక్కు కాదని స్పష్టం చేసింది. కొత్త గవర్నర్‌ ప్రభుత్వ సిఫార్సులను పరిశీలించి, నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఇస్తూ.. విచారణను జూలై 22కు వాయిదా వేసింది.


కేసు పూర్వాపరాలు ఇవీ...

బీఆర్‌ఎస్‌ హయాంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా.. అప్పటి గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని ఇద్దరూ వేర్వేరుగా హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టులో కేసు నడుస్తుండగానే.. కోదండరాం, ఆమీర్‌ అలీఖాన్‌ను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సిఫారసు చేయగా.. గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీనిపై దాసోజు, సత్యనారాయణ మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. 2024 మార్చి 17న ధర్మాసనం తీర్పు వెలువడింది. దాసోజు, కుర్రా నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అలీఖాన్‌ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేయగా, గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో 2024, ఆగస్టు 4న తమకు న్యాయం చేయాలని కోరుతూ దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత గత ఏడాది ఆగష్టు 13న కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే.. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోదండరాంతోపాటు అజారుద్దీన్‌ పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Apr 23 , 2026 | 04:33 AM