Share News

ఆ 2 పిటిషన్లపై 3 వారాల్లో తేల్చండి

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:13 AM

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్ల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది.

ఆ 2 పిటిషన్లపై 3 వారాల్లో తేల్చండి

  • లేదంటే కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటారు

  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం హెచ్చరిక

  • పిటిషనర్లు కోరడంతోనే వాయిదా

  • మరో మూడు వారాల సమయం ఇవ్వండి

  • స్పీకర్‌ ఆఫీసు తరఫున సింఘ్వీ అభ్యర్థన

  • వాస్తవాలు వక్రీకరిస్తున్నారు.. మునిసిపల్‌ ఎన్నికలతో విచారణకు సంబంధం లేదు

  • బీఆర్‌ఎస్‌ న్యాయవాది మోహిత్‌రావు

  • తుది నిర్ణయం కోసం నిజాయితీగా కృషి చేస్తున్నాం.. అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్ల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంతకాలం పడుతుంది? అంటూ అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో మిగిలిన 2 పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు తేల్చిచెప్పింది. లేనిపక్షంలో కోర్ట ధిక్కరణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ సందర్భంగా కోర్టు స్పీకర్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ, పిటిషనర్ల తరఫున(బీఆర్‌ఎస్‌) మోహిత్‌ రావు హాజరయ్యారు.


అవతలి పక్షమే వాయిదా కోరింది: సింఘ్వీ

పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 8 మందిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారని న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తెలిపారు. మిగిలిన ఇద్దరి పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారని చెప్పారు. మరో మూడు వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మునిసిపల్‌ ఎన్నికలు ఉన్నాయని, అవతలి పక్షమే సమయం కోరిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మళ్లీ వాయిదా కోరడంపై కేటీఆర్‌ సహా ఇతర పిటిషనర్ల తరఫు న్యాయవాది మోహిత్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పీకర్‌ మూడుసార్లు వాయిదా కోరారని గుర్తుచేశారు. ‘‘మునిసిపల్‌ ఎన్నికలతో ఈ అంశానికి సంబంధం లేదు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. జనవరి 16 తర్వాత కోర్టు వారికి రెండు వారాల సమయం ఇచ్చింది. తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటామని అప్పుడు అంగీకరించారు. జనవరి 30న విచారణ చేపట్టారు. నన్ను అఫిడవిట్‌ దాఖలు చేయమంటే 3 రోజుల్లోనే చేశా. తర్వాత ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. స్పీకర్‌ కేవలం ఒక్క ఎమ్మెల్యేపై మాత్రమే విచారణ నిర్వహించి, మిగిలిన ఇద్దరిపై వేసిన పిటిషన్ల విచారణలో ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారు. ఇది సరికాదు. ఒక ఎమ్మెల్యే(దానం నాగేందర్‌) బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆర్నెల్లు తిరగకముందే ఆయన కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని చెబుతున్నారు. ఈ విషయంలో నిర్ణయించడానికి ఏముంది? మరో ఎమ్మెల్యే(కడియం శ్రీహరి) కుమార్తె కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. కాంగ్రెస్‌ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ, ఆయనా బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని అంటారు. ఇందులో తేల్చలేకపోవడానికి ఏమీ లేదు’’ అని మోహిత్‌రావు వాదించారు.


స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం

గత విచారణలో స్పీకర్‌ మూడు వారాల సమయం కోరారని, అయితే ఏదైనా పురోగతి ఉందేమో చూడడానికి కోర్టు రెండు వారాల సమయం ఇచ్చిందని జస్టిస్‌ సంజయ్‌ గుర్తుచేశారు. ఒక నిర్ణయం తీసుకున్నందున, వారికి మరికొంత సమయం ఇవ్వడం సముచితమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మరో మూడు వారాల సమయం ఇస్తున్నాం. ఈలోగా స్పీకర్‌ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. లేనిపక్షంలో మేం కోర్టు ధిక్కరణ చర్యలతో ముందుకు వెళ్తాం’’ అని జస్టిస్‌ సంజయ్‌ హెచ్చరించారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. అలాగే, కేసు విచారణ ముగిసిన తర్వాత.. న్యాయవాద వృత్తిలోని నైతికతపై జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ గుర్తు చేశారు. కోర్టు గదుల్లో జరిగే వాదనలను రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో రీల్స్‌ రూపంలో పోస్టులు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘న్యాయస్థానాలను రీల్స్‌ కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమగా మారింది. అలా చేయకండి’ అని హితబోధ చేశారు.

నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం.. అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్‌

ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి తామెంతో నిజాయితీగా ప్రయత్నిస్తున్నామని అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలన్న నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తీర్పు వెలువరించామని, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలకు వ్యతిరేకంగా దాఖలైన దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిపై విచారణ సాధ్యమైనంత వేగంగా జరిపి 6 వారాల్లోపు నిర్ణయం తీసుకుంటామని అభ్యర్థించారు.

Updated Date - Feb 07 , 2026 | 04:13 AM