Share News

మెడికల్‌ కాలేజీ ఫీజుల వివాదాన్ని త్వరగా తేల్చండి

ABN , Publish Date - May 27 , 2026 | 04:46 AM

తెలంగాణలో వైద్య విద్య ఫీజుల ఖరారుకు సంబంధించి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టును ....

మెడికల్‌ కాలేజీ ఫీజుల వివాదాన్ని త్వరగా తేల్చండి

  • తెలంగాణ హైకోర్టుకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వైద్య విద్య ఫీజుల ఖరారుకు సంబంధించి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, 2017 నుంచి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని తెలంగాణ ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘానికి సూచించింది. 2017-18లో సీట్ల విభజన, ఫీజుల ఖరారుపై తెలంగాణ ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది. కన్వీనర్‌ కోటా విద్యార్థులకు తక్కువ ఫీజు నిర్ణయించి, ఆ భారాన్ని మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్థులపై మోపారని ఆరోపిస్తూ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఎన్‌ఆర్‌ఐ కోటా మినహా మిగిలిన వారందరికీ ఒకే ఫీజు ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నాయి. అదే సమయంలో ఫీజుల సవరణ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. అప్పటినుంచి పెండింగ్‌లో ఉన్న ఆ పిల్‌ను సత్వరమే పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం 2026 మే13న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చిం ది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శేషాద్రి నాయుడు, అల్లంకి రమేష్‌ వాదనలు వినిపించారు. 2017 నుంచి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలపై హైకోర్టులో ఎప్పటికప్పుడు ేస్టలు వస్తున్నాయనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో కేసు నడుస్తుండగానే 3 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసుకుని బయటికి వెళ్లారని తెలియజేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని, పెండింగ్‌ కేసును త్వరగా పరిష్కరించేలా హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఆ పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.

Updated Date - May 27 , 2026 | 04:46 AM