Supreme Court Denies Permission to Question Harish Rao: ఫోన్‌ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు ఊరట
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:46 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది....
ఆయనను విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చని వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హరీశ్‌తోపాటు, మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్‌రావును ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్‌ను హరీశ్‌రావు ఆదేశాల మేరకు రాధాకిషన్ రావు ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట స్టేషన్‌లో 2024లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ ఏడాది డిసెంబరు 1న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు క్రమంలో హరీశ్‌రావు పీఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో, తనపై అక్రమంగా కేసు పెట్టారని, నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ హరీశ్ రావు 2024 డిసెంబరు 4న హైకోర్టును ఆశ్రయించారు. హరీశ్‌పై కేసు పెట్టడానికి సరైన ఆధారాలు లేవన్న ఆయన తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు 2025 మార్చి 20న హరీశ్‌రావుపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును ఛక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణాలేమీ కనిపించడం లేదని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఛక్రదర్ రావు పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం గతేడాది జూన్ 18న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌ను డిసెంబరు 30న సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరిపింది.
బీఆర్‌ఎ్‌సలో చేరకపోతే అంతుచూస్తామన్నారు: సిద్దార్థ్ లూథ్ర
బీఆర్‌ఎస్‌లో చేరాలని, లేకపోతే అంతు చూస్తామని హరీశ్‌రావు ప్రోద్బలంతో కొందరు చక్రధర్ గౌడ్‌ను బెదిరించారని న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లో హరీశ్‌రావును విచారించడం ద్వారా ఎన్నో నిజా లు వెలుగులోకి వస్తాయన్నారు. ‘చక్రధర్‌రావు బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈక్రమంలోనే చక్రధర్ గౌడ్ ఐఫోన్‌ను రిమోట్ యాక్సెస్ చేసి సమాచారాన్ని తస్కరించే యత్నం చేస్తున్నారని యాపిల్ సంస్థ నుంచి ఆయనకు మెయిల్ ద్వారా హెచ్చరికలు వచ్చాయి. ఈ వివరాలతో చక్రధర్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దర్యాప్తు అధికారి సేకరించిన కీలక సమాచారా న్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండానే హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. దీనివల్ల ప్రస్తుతం దర్యాప్తునకు తీవ్రఆటంకం కలుగుతోంది’ అని లూథ్ర వాదన లు వినిపించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని హరీశ్ హామీ ఇచ్చారని, ఆ షరతుతోనే ఆయనకు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ ఇచ్చిందని, కానీ హరీశ్ సహకరించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేకమంది బాధితులున్నారని, హరీశ్‌ను విచారించడం ఎంతో అవసరమన్నారు. లూథ్ర వాదనలపై హరీశ్‌రావు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, ఏవోఆర్ మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదీర్ఘ విచారణ తర్వాతే హైకోర్టు తీర్పునిచ్చిందని, ఇదే అంశంపై చక్రధర్ గౌడ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం: జస్టిస్ నాగరత్న
ఇరుపక్షాల వాదనలు విన్నతర్వాతే హైకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పునిచ్చిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే వ్యవహారంలో ఫిర్యాదుదారుడి (చక్రధర్‌గౌడ్) పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే డిస్మిస్ చేసింది కదా? అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతరులకు సంబంధించిన పిటిషన్లు సైతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిస్థితి ఏమిటని లూథ్ర ప్రశ్నించారు. అయి తే, తాము వెలువరించే ఉత్తర్వులు ఈ పిటిషన్ (హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు)కు మాత్రమే వర్తిస్తాయని, మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.